చిరంజీవి పుట్టిన రోజున ‘విశ్వంభర’ టీజర్ విడుదల చేద్దామనుకొన్నారు. కానీ వీఎఫ్ఎక్స్ సంతృప్తికరంగా రాకపోవడంతో, ఆ ప్రయత్నాన్ని విరమించుకొని, ఒక్క పోస్టర్ తో సరిపెట్టుకొన్నారు. ఇప్పుడు దసరా వస్తోంది. ఈసందర్భంగా టీజర్ విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది. టీజర్ కూడా రెడీగా ఉంది. చిత్రబృందం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొంది. సంతృప్తికరంగా అనిపించింది. దసరా సందర్భంగా విడుదల చేస్తే బాగుంటుందన్నది ఆలోచన.
అయితే.. చిరంజీవి నుంచి ఓ గ్రీన్ సిగ్నల్ రావాల్సివుంది. ‘విశ్వంభర’ని జనవరి 10న విడుదల చేద్దామనుకొన్నారు. కానీ ‘గేమ్ ఛేంజర్’ డిసెంబరు నుంచి వాయిదా పడి, సంక్రాంతి బరిలో నిలవబోతోందన్న వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ‘విశ్వంభర’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని, వేసవికి షిఫ్ట్ అవుతుంది. వేసవిలో విడుదలయ్యే సినిమాకు ఇప్పుడే టీజర్ ఎందుకూ..? అని చిరు భావిస్తే… ‘విశ్వంభర’ టీజర్ కాకపోవొచ్చు. ఒకవేళ వచ్చినా, అందులో రిలీజ్ డేట్ గురించిన ఎలాంటి సమాచారం ఉండకపోవొచ్చు.
విశ్వంభర షూటింగ్ ఈపాటికి పూర్తవ్వాల్సింది. కానీ చిరంజీవి ఈమధ్య స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. అందుకే షూటింగ్ ఆలస్యమైంది. ఈ దసరాకు ఆయన మళ్లీ సెట్ కి వచ్చే అవకాశం ఉంది. ఆయన మూడు రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఇది కాకుండా రెండు పాటల్ని పూర్తి చేయాల్సివుంది. అందులో ఓ ఐటెమ్ సాంగ్ ఉంది. ఇవి రెండూ నవంబరులో పూర్తి చేయాలి. సంక్రాంతికి వచ్చినా, రాకపోయినా ఈ వర్క్ మాత్రం నవంబరులో పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది.