మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఓ ఇంటి సెట్ వేశారు. హీరో ఇంటికి సంబంధించిన సన్నివేశాలన్నీ అక్కడే తీశారు. ఇప్పుడు అదే సెట్లో ‘విశ్వంభర’ షూటింగ్ జరుగుతోంది. చ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. త్రిష కథానాయిక. ఈ సినిమా కోసం ‘గుంటూరు కారం’ సెట్లో ఓ పాట తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి, త్రిషతో పాటు మిగిలిన ప్రధాన తారాగణం అంతా ఈ పాటలో పాలు పంచుకొంటున్నారు. కీరవాణి సంగీతం అందించారు. శోభి మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. ఫ్యామిలీ సాంగ్ ఇది. చిరు.. ఐదుగురు సోదరీమణులకు ముద్దుల అన్నగా కనిపించనున్నాడు. అక్కా చెల్లాయిలతో సంక్రాంతి ఎఫెక్టులతో సాగే పాట ఇది. చిరు చెల్లాయిలుగా ఇషాచావ్లా, సురభి, ‘నా సామిరంగ’ ఫేమ్ అషికా రంగనాథ్ తదితరులు నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి మరో కథానాయికగా కనిపించనుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ ఇది. చిరంజీవి.. భీమవరం దొరబాబుగా కనిపించబోతున్నాడు. జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.
*చిరు డ్యూయల్ రోల్?
ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తారని ప్రచారం జరుగుతోంది. డ్యూయల్ రోల్ ఏమో గానీ, చిరు మాత్రం రెండురకాల గెటప్పుల్లో కనిపించనున్నాడని టాక్. ఇందులో చిరుని వృద్ధుడిగానూ చూపించబోతున్నారని తెలుస్తోంది. అందుకోసం గెటప్ టెస్ట్ కూడా జరిగిందట. అయితే ఆ రోల్ నిడివి ఎంత? ఆ పాత్రకున్న ప్రాధాన్యం ఏమిటి? అనే వివరాలు తెలియాల్సివుంది.