ఈ దసరాకు సరైన కానుకే ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘విశ్వంభర’ టీజర్‌ని విడుదల చేశారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష కథానాయిక. ఈ సంక్రాంతదికి రావాల్సిన సినిమా ఇది. `గేమ్ ఛేంజర్`కు దారి వదలడం కోసం వాయిదా వేయాల్సివచ్చింది. ఆ లోటు పూడుస్తూ ఈరోజు టీజర్ వదిలారు. 1 నిమిషం 33 సెకన్ల నిడివి ఉన్న టీజర్ ఇది. విజువల్ ఎఫెక్ట్స్ కు పెద్ద పీట వేస్తూ టీజర్‌ని కట్ చేసిన విధానం ఆకట్టుకొంది. విచిత్రమైన పక్షులు, డైనోసార్లు, ఎగిరే గుర్రాలూ, మనం చూడని కొత్త లోకం, అవతార్ ని గుర్తు చేసే మనుషులు.. ఇలా విశ్వంభర కోసం ఓ కొత్త లోకాన్నే సృష్టించాడు వశిష్ట. తెల్లగుర్రంపై చిరంజీవి ఎగురుకుంటూ రావడం… మెగా ఫ్యాన్ మూమెంట్ అని చెప్పుకోవొచ్చు.
”విశ్వాన్ని అలుముకొన్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు..ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది. విర్రవీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహాయుద్ధాన్ని తీసుకొస్తుంది” అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఆ డైలాగ్, విజువల్స్ చూస్తుంటే.. ఓ సృష్టికి ఓ ఉపద్రవం పొంచి ఉందని, దాన్ని కాపాడడానికి యోధుడు లాంటి హీరో ఎంట్రీ ఇస్తాడని అర్థమైంది. సోషియో ఫాంటసీ కలగలిపిన కథ ఇది. విజువల్ ఎఫెక్ట్స్ కు పెద్ద పీట వేశారు. అందుకోసం చిత్రబృందం ఎంత కష్టపడిందో.. టీజర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. చిరు నుంచి డైలాగ్ ఒక్కటీ లేకపోవడం కాస్త వెలితి. అయితే.. చిరు లుక్ మాత్రం అదిరింది. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం ఈ టీజర్ ని మరింత ఎలివేట్ చేసింది. రిలీజ్ డేట్ విషయంలో టీజర్ లో క్లారిటీ వస్తుందనుకొన్నారు. కానీ.. ఆ విషయంలో టీజర్ లోనూ స్పష్టత లేదు.