భోళా శంకర్ తరవాత చిరంజీవి అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకొని చేస్తున్న సినిమా ‘విశ్వంభర’. వశిష్ట ఈ చిత్రానికి దర్శకుడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ ఇది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. ఇది వరకే కొంత మేర షూటింగ్ జరిగింది. అయితే చిరంజీవి మాత్రం సెట్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఫిబ్రవరి తొలి వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసింది టీమ్. ఈ షెడ్యూల్ లో చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటారని సమాచారం.
అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవంలో పాల్గొన్న చిరు.. హైదరాబాద్ తిరిగొచ్చారు. ఈసారి ప్రకటించే పద్మ అవార్డుల్లో చిరుకి పద్మ విభూషన్ దక్కబోతోందని ముందే లీకులు వచ్చేశాయి. చిరుకి పద్మ విభూషన్ వస్తుందా, రాదా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. చిరంజీవి మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా ‘విశ్వంభర’ కొత్త షెడ్యూల్ పై ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో జరిగే ఈ కొత్త షెడ్యూల్ లో త్రిష కూడా అడుగు పెట్టబోతోందని తెలుస్తోంది. చిరు ఈ సినిమాలో భీమవరం దొరబాబుగా, ఐదుగురు చెల్లాయిల ముద్దుల అన్నయ్యగా కనిపించబోతున్నారు. ఆ పాత్రల కోసం పేరున్న కథానాయికల కోసం అన్వేషణ జరుగుతోంది. సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.