ఎట్టకేలకు విశ్వరూపం 2కి మోక్షం దొరికింది. ఈ సినిమాకి అన్ని అడ్డంకులూ తొలిగాయి. ఇక విడుదల చేయడమే తరువాయి. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు ప్రమోషన్లను కూడా మొదలెట్టింది. అందులో భాగంగా విశ్వరూపం 2 ట్రైలర్ వచ్చింది. విశ్వరూపం 1లానే… దేశభక్తి, టెర్రరిజం చుట్టూ నడిచిన కథ. మతం తాలుకూ విశ్వాసాలనూ ప్రశ్నించబోతున్నాడు కమల్ హాసన్ అనే సంగతి ఈ ట్రైలర్‌లోని ఓ డైలాగ్ ద్వారా అర్థమవుతోంది. విశ్వరూపం 1లానే ఇందులోనూ యాక్షన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు కమల్. మాటల కంటే బుల్లెట్లు, బాంబుల సౌండింగులే ఎక్కువ వినిపిస్తున్నాయి. ఆండ్రియాను వీలైనంత `వాడుకున్నట్టు` అర్థమవుతోంది. యాక్షన్ పరంగానూ… రొమాన్స్ పరంగానూ. బెడ్ రూమ్ సీన్లు, లిప్ లాక్కులు ఈ సినిమా నుంచి కూడా ఆశించొచ్చు. `విశ్వరూపం` అప్పట్లో కాస్త వివాదాస్పద మైంది. కొన్ని చోట్ల ప్రదర్శనలూ నిలిపివేశారు. ఈ విషయమై కమల్ ఇప్పటికీ బాధపడుతుంటాడు. తన ధోరణి మార్చుకుని ఈ సినిమాని వివాదాలకు దూరంగా తీర్చిదిద్దాడా, లేదంటే.. ఎప్పట్లా.. తన `విశ్వరూపం` మొత్తం ఇందులో చూపించే ప్రయత్నం చేశాడా? అనేది రాబోయే రోజులే చెప్పాలి. విశ్వరూపం 1ని బాగా ఇష్టపడినవాళ్లూ, కమల్ అంటే అభిమానించేవాళ్లూ, యాక్షన్ సినిమాల్ని మిస్ చేయనివాళ్లూ.. తప్పకుండా `విశ్వరూపం 2`పై దృష్టి పెట్టేలా ఈ ట్రైలర్ ఉంది.