హైదరాబాద్: కాపు గర్జన సందర్భంగా తునిలో నిన్న చెలరేగిన విధ్వంసానికి నిఘా వైఫల్యమే కారణమని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. నార్త్ కోస్టల్ ఐజీ విశ్వజిత్ ఇవాళ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల వాదనకు బలమిచ్చేవిధంగా, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేటట్లుగా ఉన్నాయి. విశ్వజిత్ ఇవాళ తుని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తునిలో నిన్న జరిగిన పరిణామాన్ని ఎవరూ ఊహించలేదని, నిరసనకారులతో ఈ స్థాయిలో ఉద్రిక్తత తలెత్తుతుందని అంచనా వేయలేకపోయామని అన్నారు. తదుపరి పరిణామాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భారీగా బలగాలను మోహరిస్తున్నామని తెలిపారు. కిర్లంపూడిలో కూడా పరిస్థితులను ఎదుర్కోవటానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు.