బయోపిక్‌ల పరంపరలో ఇది మరో సినిమా. కళాతపస్వి జీవిత కథ ఇప్పుడు సినిమాగా రాబోతోంది. `విశ్వదర్శనం` పేరుతో విశ్వనాథ్ జీవితాన్ని సినిమాగా మలుస్తున్నారు. దీనికి జనార్థన్ మహర్షి దర్శకత్వం వహిస్తారు. ఈరోజు హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా శ్రీకారం చుట్టుకుంది. ‘వెండి తెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అనేది ట్యాగ్‌లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి విశ్వనాథ్ జీవితాన్ని ఓ డాక్యుమెంటరీగా తీయాలనుకున్నారు జనార్థన్ మహర్షి. అయితే.. దాన్ని సినిమాగా మలిస్తే కమర్షియల్గానూ వర్కవుట్ అవుతుందనిపించి, ఇంకాస్త లార్జ్ స్కేల్లోకి తీసుకెళ్తున్నారు. విశ్వనాథ్ పుట్టుక నుంచి ఇప్పటివరకూ వివిధ దశలలో ఆయన జీవితం ఎలా సాగింది? అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరి విశ్వనాథ్ పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది చూడాలి.