వైవా హర్ష. యూ ట్యూబ్లో స్టార్. తన వీడియోలన్నీ లక్షల హిట్స్ అందుకున్నాయి. వైవా హర్ష షార్ట్ ఫిల్మ్ అంటే.. యూ ట్యూబ్ ఫాలోవర్లకు మంచి కాలక్షేపం. అయితే.. ఆ క్రేజ్ ని సినిమాల్లో నూ చూపించలేకపోయాడు. కొన్ని సినిమాలు చేసినా వైవా హర్షకు ఎలాంటి బ్రేక్ ఇవ్వలేకపోయింది. `యూ ట్యూబ్ కి ఎక్కువ – సినిమాకి తక్కువ` అన్నట్టు సాగిపోయింది తన కెరీర్. అయితే ఇప్పుడు అనూహ్యంగా తన చేతినిండా ఆఫర్లు. ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా ఆరు సినిమాలు వైవాని వెదుక్కుంటూ వచ్చాయి. ఇదంతా..`కలర్ ఫొటో` పుణ్యం.
ఆహాలో విడుదలైన సినిమా `కలర్ ఫొటో`. ఈ సినిమాకి మంచి ఆదరణే లభించింది. అయితే సుహాస్ కంటే.. వైవా హర్ష గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు జనాలు. ఓ మంచి ఫ్రెండ్ పాత్రలో.. వినోదాన్ని, చివర్లో ఉద్వేగాన్ని పంచి పెట్టాడు వైవా హర్ష. తను ఇది వరకటిలానే కామెడీ నే చేసుంటే ఈ సినిమాలో హర్ష పాత్ర అంతగా గుర్తుండేది కాదు. కామెడీతో పాటు ఎమోషన్ నీ పండించాడు. అందుకే తనకి మంచి మార్కులు పడ్డాయి. సరిగా వాడుకుంటే… వైవా హర్షనీ తమ సినిమాలకు ప్లస్పాయింట్ గా మార్చుకోవచ్చని దర్శకులు ఇప్పుడిప్పుడే నమ్ముతున్నారు. ఓ సినిమా హిట్టయితే అవకాశాలు రావడం మామూలే. అయితే థియేటర్లో విడుదల కాని సినిమా వల్ల… ఓ నటుడి కెరీర్ టర్న్ అవుతోందిప్పుడు. అదే మ్యాజిక్.