వైవా హర్షగా పాపులర్ అయ్యాడు హర్ష. యూ ట్యూబ్ వీడియోలతో తన ప్రతిభని నిరూపించుకొన్నాడు. ఆ తరవాత హాస్య నటుడిగా మారాడు. ఇప్పుడు హీరో అయిపోయాడు. తను హీరోగా నటించిన ‘సుందరం మాస్టారు’ ఈనెల 23న విడుదలకు సిద్ధమైంది. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్య శ్రీపాద కథానాయికగా నటించింది. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది.
ఓ గూడెం. అక్కడ ఇంగ్లీష్ పాఠాలు బోధించడానికి వచ్చిన మాస్టారు. ఇదీ కథ. నిజానికి ఓ సీరియస్ టాపిక్ చెప్పడానికి ఇదో అనువైన వేదిక. కాకపోతే… దాన్ని కాస్త ఫన్నీగా మార్చేశారు. విచిత్రం ఏమిటంటే మాస్టారు కంటే గూడెం ప్రజలకే ఇంగ్లీష్ బాగా వచ్చు. అక్కడ తన వచ్చీ రాని ఇంగ్లీష్‌తో హీరో తిప్పలు పడుతుంటాడు. పైగా గూడెంలో ఆచారాలు పద్ధతులు కూడా విచిత్రంగా ఉంటాయి. అవన్నీ సరదా సన్నివేశాలుగా మారిపోయిన వైనం ట్రైలర్లో కనిపిస్తుంది. దానికి కాస్త సస్పెన్స్ మిళితం చేశారు. ఆ ఊర్లో విలువైనది ఏదో ఉందన్న పాయింట్ వైపు కథ మళ్లుతుంది. ఇంతకీ అంత విలువైన వస్తువు అక్కడ ఏముంది? ఆ ఊరి ప్రజలు అంత ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు? ఆ గూడెం కథేమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. లొకేషన్లు చాలా సహజంగా, అందంగా కుదిరాయి. హర్ష కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే. చాలా సన్నివేశాల్ని తను లాక్కొచ్చేయగలడు. ఓ కమెడియన్ ని హీరోగా మార్చే ఈ ప్రయత్నం ఎంత వరకూ వర్కవుట్ అయ్యిందో తెలియాలంటే మరో వారం ఆగాలి.