యువ హీరోలు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. నటిస్తూనే, నిర్మాతలుగానూ తమ అభిరుచి చాటుకుంటున్నారు. సందీప్ కిషన్ కీ ఓ నిర్మాణ సంస్థ ఉంది. `వివాహ భోజనంబు`కి తానే నిర్మాత. హాస్య నటుడు సత్య హీరోగా ప్రమోషన్ గా పొందిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా. నిర్మాతగా సందీప్ కిషన్‌కి బాగానే గిట్టుబాటు అయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాని సోనీ కి రూ.1.5 కోట్లకు అమ్మేశాడు సందీప్. దాంతో పాటు శాటిలైట్ హక్కులు, ఇతర హక్కుల రూపంలో మరో 1.5 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. అంటే.. రూ.3 కోట్ల బిజినెస్ చేశాడన్నమాట. సినిమా మాత్రం కోటి రూపాయల్లో పూర్తి చేసినట్టు సమాచారం. వడ్డీలు, ప్రచార ఖర్చులు అన్నీ రూ.50 లక్షల వరకూ వేసుకున్నా.. మరో కోటిన్నర లాభమే. సందీప్ కి హోటెల్ వ్యాపారం ఉంది. `వివాహ భోజనంబు` పేరుతో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు సందీప్. ఈ సినిమాలో `వివాహ భోజనంబు` రెస్టారెంట్ కి ప్రచారం కూడా చేసేసుకున్నాడు.
మొత్తానికి నిర్మాతగా సందీప్ లాభాల రుచి చూశాడు. ఇదే ఊపులో… తన బ్యానర్లో మరో రెండు సినిమాల్ని రూపొందించాలని ప్లాన్ వేస్తున్నాడట. ఓ సినిమాలో తనే హీరో. మరో సినిమా బయటి హీరోతో తీస్తాడు. ఇవి రెండూ ఓటీటీ కోసమే అని టాక్. ఇప్పటికే కథలు సిద్ధమైపోయాయని, ఈ సినిమాల్నీ తక్కువ బడ్జెట్ లోనే పూర్తి చేసి, విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ దక్కించుకోవాలని చూస్తున్నాడని టాక్.