గెలుపు కోసం పని చేసిన ముఖ్యులకు డొనాల్డ్ ట్రంప్ పదవులు ఇచ్చారు. మిగతా వారి సంగతేమో కానీ ఆయన కోసం బాగా పని చేసిన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు మాత్రం.. కొత్త డోగే అనే కొత్త విభాగం సృష్టించి పదవులు ఇచ్చారు. వీరి పని ఏమిటంటే.. ప్రభుత్వంలో వృధా ఖర్చులు తగ్గించడం.. సామర్థ్యాన్ని పెంచడం. అయితే ట్రంప్ పదవి చేపట్టి వైట్ హౌస్లోకి అడుగు పెడుతున్న సమయంలోనే ఇదో పెద్ద వృధా అని అనుకున్నారేమో కానీ.. వివేక్ రామస్వామి గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించారు.
అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్ తో పోటీ పడిన వివేక్ రామస్వామి వెనుకబడిపోయారు. తర్వాత ట్రంప్ కే మద్దతు పలికారు. అయితే ఆయన విషయంలో ట్రంప్ అంత సానుకూలంగా ఉండరని చెబుతూ ఉంటారు. అందుకే పని లేని శాఖను సృష్టించి ఆ పదవి ఇచ్చారని అనుకుంటున్నారు. నిజానికి వివేక్ రామస్వామికి అత్యంత కీలక మంత్రిత్వ శాఖల్లో ఒకటి లభిస్తుందని అనుకున్నారు. విదేశాంగ మంత్రిత్వశాఖ సహా చాలా పదవుల్లో పేరు వినిపించింది. చివరికి ట్రంప్ నిరాశ పరిచారు.
ఇప్పుడు డోజేను తీసుకుని వివాదాస్పద నిర్ణయాలతో ఇమేజ్ చెడగొట్టుకోవడం కన్నా.. తన సొంత రాష్ట్రం ఓహయో గవర్నర్ కోసం పోటీపడితే బెటరని అనుకుంటున్నారు. గవర్నర్ గా ఉంటే వచ్చే సారికి అయినా అభ్యర్థిత్వం కోసం మరోసారి పోటీ పడే అవకాశం లభిస్తుంది. అందుకే అన్నీ ఆలోచించి ట్రంప్ ఇచ్చిన పదవిని త్యజించాలని నిర్ణయించుకున్నారు. ఎలాన్ మస్క్ కు పదవి ఇచ్చినా ఆయన వ్యాపారాలతో తీరిక ఉండదు. కాబట్టి ఇక డోజే అనే విభాగం ఉన్నా లేనట్లేనని గుసగుసలు ప్రారంభమయ్యాయి.