మాజీ ఎంపీ వివేక్ భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన పార్టీ మారిన సందర్భంగా… ఆయన్ని చాలామంది అడుగుతున్న ప్రశ్న, బయట్నుంచి వినిపిస్తున్న విమర్శ ఏంటంటే… ఈయన ఇంకా ఎన్నిపార్టీలు మారతారూ అని! కాంగ్రెస్, తెరాస మధ్య చక్కర్లు కొట్టి.. చివరికి భాజపాలో చేరారు. పార్టీ మార్పుపై వినిపిస్తున్న విమర్శల మీద కూడా ఆయన స్పందిస్తూ… ప్రజల అవసరాల కోసం పార్టీలు మారాల్సి వచ్చిందిగానీ, తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కాదని కూడా మీడియా ముందు మొన్ననే చెప్పారు. అయితే, ఇప్పుడు ఆయన ప్రయత్నం ఏంటంటే… తానొక్కడినే పార్టీ మారలేదనీ, చివరికి సీఎం కేసీఆర్ కూడా పార్టీలు మారారు కదా అనే వాదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమం కోసం నిజంగా పనిచేసిన కోదండరామ్, హరీష్ రావు, డీకే అరుణ, ఈటెల రాజేందర్, జితేందర్ రెడ్డి.. ఇలాంటి వాళ్లను సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారని వివేక్ ఆరోపించారు. దాన్ని ప్రజలు గమనించారనీ, అందుకే పార్లమెంటు ఎన్నికల్లో తెరాసకు సీట్లు తగ్గాయన్నారు. కేసీఆర్ మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారనీ, యూత్ కాంగ్రెస్ లో జనరల్ సెక్రటరీగా ఉన్నారన్నారు. ఆ తరువాత, కొత్తగా తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు పెడితే.. వెళ్లి ఆ పార్టీలో చేరిపోయారన్నారు. వాళ్లబ్బాయి పేరును కూడా తారక రామారావు అని పెట్టుకున్నారన్నారు. ఆ తరువాత, ఎన్టీఆర్ కి ఎన్నుపోటు పొడవడంలో కీలక పాత్ర కేసీఆర్ పోషించారని వివేక్ ఆరోపించారు. ఎక్కడ కూడా నిలకడ లేని నాయకుడు ఆయన అని వివేక్ చెప్పారు! అన్ని పార్టీలు మారిన తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టారనీ, అందర్నీ నమ్మించి ద్రోహం చేశారని విమర్శించారు.
కేసీఆర్ కూడా నిలకడలేని నాయకుడనీ, చాలా పార్టీలు మారారని చెప్పే ప్రయత్నం చేశారు వివేక్! నిజానికి, ఇప్పుడు కేసీఆర్ పార్టీ మార్పుపైగానీ, గతంలో ఆయన ఎన్ని పార్టీలు మారారు అనేది ప్రధానమైన చర్చే కాదు కదా. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకూ? దాని వల్ల భాజపాకి కూడా పెద్దగా ఉపయోగం లేదు. రాష్ట్రంలో భాజపాకి మద్దతు పెంచుకోవాలంటే కేసీఆర్ సర్కారు విధానాలపై విమర్శలు చేస్తేనే కొంతైనా ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంటుంది! సో… వివేక్ ఈ టాపిక్ ఎత్తుకుని మాట్లాడటంలోనే, ఆయనపై గతవారం రోజులుగా వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది. అందరూ మారుతున్నారు, చివరికి కేసీఆరే మారారు… తాను మారితే తప్పేంటనే అభిప్రాయం కలిగించడం కోసమేనా ఈ తాపత్రయం అనిపిస్తోంది.