తెలంగాణ కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ అలవాటైనట్టుంది. తెరాస వేట జోరుగా సాగుతూనే ఉంది. మరికొందరు కాంగ్రెస్ నేతలు కారెక్కడం ఖాయమని ఆదివారం మీడియా కోడై కూసింది. మాజీ మంత్రి వెంకట స్వామి తనయులైన రాష్ట్ర మాజీ మంత్రి వినోద్, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ లు తెరాసలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. వీరి చేరికకు సోమవారమే సుముహూర్తమని కూడా వార్తలు వస్తున్నాయి.
ఆర్థికంగా బలవంతులైన వినోద్, వివేక్ లు కాంగ్రెస్ కు దూరమైతే అది ఆ పార్టీకి పెద్ద దెబ్బ. ప్రస్తుతం వారిద్దరికీ ఎలాంటి పదవులూ లేకపోయినా అలాంటి పారిశ్రామికవేత్తలు
ఉండటం పార్టీకి అవసరమని భావిస్తున్నారు. వారిద్దరినీ కాంగ్రెస్ లోనే కొనసాగాలని పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరినా ఫలితం లేకపోయిందని సమాచారం.
వివేక్ 2019 ఎన్నికలకు ముందే తెరాసలో చేరారు. కానీ ఏమైందో ఏమో సరిగ్గా ఎన్నికల సమయంలో మళ్లీ కాంగ్రెస్ లో చేరి పెద్ద పల్లి నుంచి లోక్ సభకు పోటీ చేశారు. యూపీఏ ప్రభుత్వంపై వెల్లువెత్తిన వ్యతిరేకత, తెలంగాణ తెచ్చిన పార్టీగా తెరాసపై పెల్లుబికిన అభిమానంతో తెరాస యువ అభ్యర్థి బాల్క సుమన్ ఘన విజయం సాధించారు. సంపన్నుడైన వివేక్ ఓటమి అప్పట్లో సంచలనం కలిగించింది. అయితే ఇక కాంగ్రెస్ లో కొనసాగడం వల్ల ఉపయోగం లేదని వినోద్, వివేక్ లు నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
వీరిద్దరితోపాటు మరికొందరు కూడా తెరాసలో చేరుతారని తెలంగాణ భవన్ సమాచారం. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ ఫిరాయింపుపై కొన్ని రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. వారి వైఖరిని బట్టి చూస్తే ఈ వార్తలు పూర్తిగా అబద్ధం కాదేమో అనిపిస్తుంది. ఇంతకీ వారిద్దరూ సోమవారమే తెరాసలో చేరుతారా లేదా అనేది హాట్ టాపిక్ అయింది. మంత్రి కావాలనే కోరిక తీరడానికి తెరాస బంపర్ ఆఫర్ ఇచ్చింది కాబట్టి కారెక్కక తప్పదని గుత్తా తన అనుచరులతో చెప్పినట్టు సమాచారం. సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డికూడా ఇదే విషయం చెప్పారట.
తెరాసలో సోమవారం నాడు చాలా మంది కాంగ్రెస్ నాయకులు చేరుతారని జోరుగా వార్తలు వస్తున్నాయి. మరి వాళ్లెవరనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ కు ఏయే నాయకులు ఝలక్ ఇవ్వబోతున్నారనేది మరి కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.