వివేకా హత్య వెనుక ఉన్నది మీరే అంటూ… ఓ వర్గం ప్రణాళికాబద్దంగా ప్రచారం చేస్తూ ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిపై మానసిక దాడి ప్రారంభించారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టులు ప్రారంభించడంతో ఇక కొత్త పాత్రలు.. కొత్త లేఖలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా భరత్ యాదవ్ అనే ఊరూ పేరూ లేని పత్రికకు చెందిన జర్నలిస్టు ఒకరు తెరపైకి వచ్చారు. ఆయన సీబీఐకి ఓ లేఖ రాశానని చెప్పి.. ఆ లేఖను మీడియాకు విడుదల చేసి ఏకంగా వివేకా అల్లుడుపైనే ఆరోపణలు చేశారు. ఆస్తి కోసం వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి హత్య చేయించాడని ఆయన ఆరోపణలు ప్రారంభించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన ఓ సీక్వెన్స్ వివరించారు.
అదంతా గందరగోళంగా ఉంది. ఆయన తన భూమి వ్యవహారంలో సెటిల్మెంట్ కోసం సునీల్ యాదవ్‌ను సంప్రదించారట. వివేకానందరెడ్డి సాయంతో సెటిల్మెంట్ చేయాలనుకున్నారట. కానీ మోసం చేశారని.. ఆయన చెబుతున్నారు. ఆయన ఏ విధంగా ఎలా చెప్పినా చివరికి ఈ కేసులో వివేకా కుటుంబసభ్యులపైనే అనుమానం రెకెత్తించేందుకు తన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఆయన ప్రెస్‌మీట్‌కు .. ఓ వర్గం మీడియా మంచి కవరేజీ ఇచ్చింది. ఆయన చెప్పిన మాటలను కూడా ప్రముఖంగా ప్రచారం చేసింది.
వివేకా కేసులో దస్తగిరి వాంగ్మూలం తర్వాత.. వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడుపైనే రివర్స్ ఆరోపణలు చేస్తూ వారిని మానసికంగా ఇబ్బంది పెట్టి.. కేసు విషయంలో పట్టుదలకు పోకుండా చేసే ప్రయత్నాలను ఓ క్యాంప్ చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇంతకు ముందు అరెస్టయిన దేవిరెడ్డి శంకర్ రెడ్డికూడా ఓ లేఖ ఇలాగే రాశారు. ఆయన కూడా ఈ కేసు విషయంలో న్యాయం కోసం పోరాడుతున్న సునీత, రాజశేఖర్ రెడ్డిలపైనే ఆరోపణలు చేశారు.
వివేకా హత్య కేసులో నిందితులు దొరికిపోవడం అనేది చాలా చిన్న విషయం. హత్య కేసును గుండెపోటుగా మార్చిన వారు.. ఆధారాలు తుడిచేసిన వారే అసలైన నిందితులు. వారిని పట్టుకోవడానికి ఓ ప్రసహసనంగా వ్యవహారం సాగుతోంది. ఇప్పటికి సీబీఐ ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా.. ఇలాంటి మైండ్గేమ్లను మాత్రం విస్తృతంగా వాడుతున్నారు.