వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారికే కాదు నిందితులుగా ఉన్న వారికి కూడా ప్రాణభయం వెంటాడుతోంది. వివేకాను గొడ్డలితో నరికిన వ్యక్తిగా సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న సునీల్ యాదవ్ కడప ఎస్పీని కలిసి తనను వైసీపీ వాళ్లు బెదిరిస్తున్నారని రక్షణ కల్పించాలని కోరారు. సునీల్ యాదవ్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వైసీపీ క్యాంప్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వివేకా హత్య వెనుక ఉన్నది అందరూ చెప్పుకుంటున్న వాళ్లే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కొన్ని మీడియా చానళ్లకు ఇంటర్యూలు కూడా ఇచ్చారు. దస్తగిరి తరహాలో సునీల్ మాట్లాడుతూండటం సంచలనంగా మారింది.
ఈ క్రమంలో ఆయనకూ బెదిరింపులు వస్తున్నాయని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సునీల్ యాదవ్ ఇంటి పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. రక్షణ కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరో వైపు హత్య అనే సినిమాపై కూడా ఎస్పీకి సునీల్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ఇందులో తన తల్లిని అసభ్యంగా..క్రూరంగా చూపించారని.. మండిపడ్డారు. ఈ సినిమాను తీయించింది వైసీపీ నేతలేనని.. హత్యలో ఎనిమిది మంది పాల్గొంటే.. నలుగురే పాల్గొన్నట్లుగా చూపించారన్నారు. ఈ సినిమాను నిలిపివేయించాలని.. చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇప్పటికే అప్రూవర్ గా మారిన దస్తగిరి ప్రాణ భయం ఉందని చెప్పడంతో ఆయనకు భద్రత పెంచారు. వరుసగా సాక్షులు మరణిస్తూండటం.. మరో వైపు కేసు విచారణ ముందుకు సాగకపోవడంతో సాక్షులు, పాత్రధారులైన నిందితులు భయపడుతున్నారు. అసలు సూత్రధారులు సాక్ష్యాల్లేకుండా చేసేందుకు ఏం చేసేందుకైనా వెనుకాడరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.