వివేకా హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం కూడా తన అభిప్రాయాన్ని అఫిడవిట్ ద్వారా సమర్పించింది. దీంతో అవినాష్ రెడ్డి భవితవ్యం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
వివేకా కూతురు దాఖలు చేసిన పిటిషన్ పై ఆమె తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డి బయట ఉండి సాక్ష్యులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, ఈ కేసుపై ఏపీ సర్కార్ దాఖలు చేసిన అఫిడవిట్ పై కూడా వాదనలు జరిగాయి.
సీబీఐ ఎస్పీ రాంసింగ్, పిటిషనర్ సునీత దంపతులుపై గతంలో నమోదైన కేసులో ఎలాంటి నిజం లేదని , పోలీసుల అధికారులతో కుమ్మకై కేసు పెట్టారని సుప్రీంకోర్టుకు నివేదించారు.ఇక పిటిషనర్ సునీత, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు ముగియడంతో కౌంటర్ దాఖలుకు సమయం కావాలని ఎంపీ అవినాశ్ రెడ్డి తరఫున లాయర్లు కోరడంతో తదుపరి విచారణను జూలై నెలాఖరుగా వాయిదా వేశారు.
అయితే, ఈ కేసులో సర్కార్ వైఖరి కీలకంగా మారింది. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పూర్తిగా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆయన బెయిల్ రద్దు కావడం ఖాయమని అంటున్నారు. గతంలో ప్రభుత్వ మద్దతు ఉండటంతో ఈ కేసులో అనేక రకాల ఎత్తుగడలను వేసి ముందస్తు బెయిల్ పొందారని, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అవినాష్ రెడ్డి పాచికలు పారవని అంటున్నారు.