మాజీ ఎంపీ వివేక్ ని భాజపాలో చేర్చుకోవడం వెనక ఆ పార్టీకి రాష్ట్రంలో వెంటనే లభించిన ప్రయోజనం… ఆయనకి ఉన్న మీడియా సంస్థ! వివేక్ చేరికతో తెలంగాణలో భాజపాకి తమందంటూ ఒక సొంత పత్రిక దొరికినట్టయింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఇతర మేజర్ పత్రికలేవీ ఒక్క భాజపాకి మాత్రమే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, కేసీఆర్ సర్కారుపై ఏపక్షంగా విమర్శలు చేసే పొలిటికల్ స్టాండ్ తీసుకో లేవు. కాబట్టి, వివేక్ చేరికతో భాజపాకి అదో ప్లస్ పాయింట్ అయింది. అయితే, ఆయన చేరిన దగ్గర్నుంచీ వెలుగు పత్రికలో తెరాస మీద విమర్శల డోస్ మరింత పెంచారు. దాంతోపాటు భాజపా కవరేజ్ ఇంకా పెంచారు.
అయితే, భాజపా కార్యక్రమాల కవరేజ్ కంటే… వివేక్ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలనే భాజపా ప్రముఖ ప్రోగ్రామ్స్ గా ప్రాధాన్యత ఇస్తూ ప్రతీరోజూ ఆ పత్రికలో వార్తలు వస్తున్నాయి. నిన్న సూర్యాపేటలో వివేక్ మాట్లాడారు… అది ప్రముఖ కథనం. మొన్న హైదరాబాద్లో కేసీఆర్ కుటుంబ పాలనపై వివేక్ విమర్శ… అదీ ప్రముఖ కథనం! ఢిల్లీలో జాతీయ నాయకత్వం సమక్షంలో పార్టీలో చేరి వచ్చిన వివేక్ ను సన్మానించిన రాష్ట్ర భాజపా అధ్యక్షుడు… అదో ప్రత్యేక కథనం. వివేక్ కి స్వాగతం పలుకుతున్న రాష్ట్ర నేతలు, వివేక్ చేరికతో రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు..! ఇలా ఆయన పార్టీలో చేరిన దగ్గర్నుంచీ వివేక్ సెంట్రిక్ గానే కథనాలు ఆ పత్రికలో వస్తున్నాయి. అది ఆయన సొంత పత్రిక కాబట్టి దాన్ని తప్పుబట్టలేం. ఆయన్ని ఏ స్థాయిలో ప్రొజెక్టు చేసుకున్నా తప్పు లేదు.
అయితే, భాజపాలో వివేక్ చేరితే ఇది పార్టీ పత్రిక అవుతుందని అనుకుంటే… పార్టీ కంటే వ్యక్తిని ఎక్కువగా ప్రొజెక్టు చేసే విధంగా ఆ పత్రిక తీరు ఉంటుందోనే అభిప్రాయం ఇతర భాజపా నేతల్లో కలగడం సహజం. రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నేతల బండారు దత్తాత్రేయ, కేంద్ర సహాయ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి… ఇలా చాలామంది ప్రముఖులున్నారు కదా! వారికి మించిన ప్రాధాన్యత వివేక్ కి జాతీయ నాయకత్వం ఇస్తోందా అనే స్థాయిలో ఆ పత్రికలో కథనాలు ఉంటున్నాయనే అభిప్రాయం భాజపా శ్రేణుల్లో అప్పుడే మెల్లగా వినిపిస్తున్న పరిస్థితి! ఎంత సొంత పత్రిక అయినా… పార్టీ తరఫున నిలవాలనుకున్నప్పుడు, ఆ పార్టీలో ఉన్న హోదా క్రమాన్ని కూడా చూసుకోవాలి కదా అనే చర్చ ఇప్పుడే మొదలౌతోంది. మరి, దీన్ని ఇప్పుడే వివేక్ సమీక్షించుకుంటే బెటర్. లేదంటే, ఇది చినికిచినికి పరిస్థితి మరోలా మారే అవకాశం లేకపోలేదు.