వివేకానందరెడ్డి హత్యకు స్కెచ్ వేసింది జగనేమోనన్న అనుమానాన్ని .. హత్యకు గురైన వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐ ఎదుట వ్యక్తం చేశారు. వైఎస్ సునీత, ఆమె భర్తపై వైసీపీ నాయకులు, వివేకా హత్య కేసునిందితులు ఆరోపణలు చేస్తున్న సమయంలో సీబీఐకి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ” ఎన్నికల్లో గెలిచేందుకు జగనే… వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు పథక రచన చేసి ఉంటారన్నది తన అభిప్రాయమని ” సీబీఐకి ఆయన చెప్పారు. దానికి కోడి కత్తి ఉదాహరణను కూడా ఇచ్చారు.
కోడికత్తి దాడి తర్వాత వైద్యం చేసిన ప్రైవేటు డాక్టర్లకు జగన్ కీలక పదవులు ఇచ్చారు. వారిలో ఒకరు సాంబశివారెడ్డిని మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్‌గా, మరొకరు చంద్రశేఖర్‌రెడ్డిని ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పదవులు పొందారు. ఆ దాడి లాగే, ఎన్నికల్లో గెలవడం కోసం మా మామ హత్యకూ జగనే పథక రచన చేసి ఉంటారని రాజశేఖర్ రెడ్డి లాజిక్ చెప్పారు. దీనికి సీబీఐ అధికారుల స్పందనేమిటో తెలియాల్సి ఉంది.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తరపున మాట్లాడుతున్న వారంతా వైఎస్ సునీత, ఆమె భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. మీడియాలో విస్తృత ప్రచారం వచ్చేలా చేస్తున్నారు. అయితే ఎలాంటి మీడియా జోలికి రాకుండా వివేకా అల్లుడు తాను చెప్పాలనుకున్నది సీబీఐకే చెప్పారు. వివేకా అల్లుడు ఇచ్చిన వాంగ్మూలంలో పోలీసుల దర్యాప్తును సీఎం జగన్ ప్రభావితం చేశారన్న ఆరోపణ కూడా ఉంది. అప్పటి డీజీపీ స్వయంగా చెప్పారని కొన్ని మాటలుకూడా చెబుతున్నారు.
విపక్ష పార్టీలు కూడా ఇప్పటికే సీఎంజగన్‌పై ఆరోపణలు చేస్తున్నాయి. సొంత బాబాయి హత్య కేసులో నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే ఆయన కూడా నిందితుడేనని ఆయనను కూడా సీబీఐ ప్రశ్నించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి సీబీఐ విచారణ జరిగితే ఏమవుతుందో సీఎం జగన్‌కూ తెలుసని.. అందుకే తన పై ఉన్న కేసులకు అదనంగా మరొకటి జమ అవుతుందని సునీతతో అన్నారని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ వాంగ్మూలాలు రాజకీయంగానూ విమర్శలు, ప్రతి విమర్శలకు కారణం అవుతున్నాయి.