వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి ఇచ్చినా ముందుకు సాగడం లేదు. రెండు విడతలుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందం ఇంకా అనుమానితుల్ని ప్రశ్నిస్తూనే ఉంది. అయితే.. ఈ లోపే సీబీఐ బృందంలోని పలువురికి కరోనా సోకింది. దీంతో కరోనా సోకిన వారు క్వారంటైన్ సెంటర్లకు ఇతరులు ఢిల్లీకి పయనమయ్యారు. మొత్తంగా వివేకా హత్య కేసును పదిహేను మంది సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిలో మొత్తంగా ఏడుగురికి వైరస్ సోకింది. ఒక నెల రోజుల పాటు కేసు విచారణను బ్రేక్ వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితం.. ఒక విడత దర్యాప్తు పూర్తి చేసిన అధికారులు ఢిల్లీ వెళ్లి..ఇటీవలే తిరిగి వచ్చారు. దర్యాప్తు కోసం పులివెందుల, కాణిపాకం, తిరుమల, కదిరి ప్రాంతాలకు వెళ్లారు. ప్రధానంగా చెప్పుల షాపు యజమాని అయిన మున్నా చుట్టూ ప్రస్తుతం కేసు విచారణ సాగుతోంది. ఆయన లాకర్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం ఉండటంతో..అవిఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై విచారణ జరుపుతున్నారు. ఈ సమయంలో… ఈ కేసు విషయంలో కొన్ని కీలకమైన పరిమామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పటి వరకూ సీబీఐ కూడా..సాక్ష్యాలను తుడిచేయడానికి ప్రయత్నించిన వారిని..ఆ ఘటన జరిగినప్పుడు..ఆ ప్రాంతం నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్లాయో..ఆ కాల్ లిస్ట్ ప్రకారం… దర్యాప్తు చేయలేదు. అనుమానితుల్ని ప్రశ్నించలేదు. ఈ లోపే సీబీఐ బృందానికి కరోనా సోకడంతో తాత్కాలికంగా విచారణ ఆగిపోతోంది. న్యాయం కోసం పోరాడుతున్న వైఎస్ వివేకా కుమార్తె సునీత.. మరికొంత కాలం న్యాయం కోసం వేచి చూడక తప్పదు.