వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు నేటితో పూర్తవుతుంది. దీంతో సీబీఐ మధ్యంతర చార్జిషీటు దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకూ జరిపిన దర్యాప్తు వివరాలన్నింటినీ సీబీఐ ఛార్జిషీటులో ప్రస్తావించనుంది. కుట్రకోణం వెలుగులోకి తెచ్చేందుకు మరింత గడువు కావాలని సీబీఐ సుప్రీంకోర్టును కోరనుంది. జులై 3న సీజేఐ ధర్మాసనం ముందు అవినాష్ మధ్యంతర బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది.
అవినాష్‌ను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందుస్తు బెయిల్ మంజూరు చేసింగి, జూన్ నెల చివరి వరకు.. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం అవినాష్‌కు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి శనివారం సీబీఐ ఎదుట హాజరవుతున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐ విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ ఆయన ఓ సందర్భంలో తల్లికి అనారోగ్యం పేరుతో వారం రోజులు ఆస్పత్రిలో దాక్కుని అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. తర్వాత కోర్టు నుంచి రిలీఫ్ పొందారు.
వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తన తండ్రి హంతకులకు శిక్ష పడాల్సిందేనన్న లక్ష్యంతో వైఎస్ సునీతా రెడ్డి పోరాడుతున్నారు. మరో వైపు సునీత రెడ్డిపైనే ఆరోపణలు చేస్తూ.. జగన్ రెడ్డి, ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి కేసు నుంచి బయటపడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.