వివేకా హత్య కేసు మరోసారి ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. అవినాష్ ెడ్డి నిందితులకు శిక్ష పడాల్సిందేనని అంటున్నారు. కానీ విచారణ కు హాజరు కావడం లేదు. ఐదు రోజుల తర్వాత ఆలోచిస్తానని ఆయన చెబుతున్నారు. ఆయన అభ్యంతరాలేమిటో కానీ… ఈ కేసును ఒక్క సారిగా రివైండ్ చేసుకుంటే.. క్రైమ్ సినిమాలు చూసే వారు కూడా.. ఈ కేసును సులువుగా చేధించగలరని అర్థమైపోతుంది.
గుండెపోటని ప్రచారం చేసిందెవరు ?
వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేశారు. ఆయన తెల్లవారు జామున అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. కానీ ఆయనది గుండెపోటు అని ప్రచారం చేశారు. ఎవరికీ అనుమానం రానివ్వలేదు. కావాలనే చేశారు. ఈ ప్రచారంలో ఓ ఎంపీ.. ఓ మీడియా కీలక పాత్ర పోషించింది. హత్య ప్రాంతంలో ఉన్న వారు ఈ సమాచారం ఇచ్చారు. అంతా గూడుపుఠాణిగా చేశారు. ఇలా దారుణమైన హత్యను గుండెపోటుగా ఎందుకు ప్రచారం చేశారు ? అంటే.. సింపుల్ లాజిక్. చంపేసి… సింపుల్ గా గుండెపోటు పేరుతో కేసును క్లోజ్ చేద్దామనుకున్నారు. ఎవరు చంపి ఉంటారు… అంటే… ఈ తప్పుడు ప్రచారం చేసిన వాళ్లే. లేకపోతే హత్యను గుండెపోటుగా ప్రచారం చేయాల్సిన అవసరం వారికేంటి ?
సాక్ష్యాలను తుడిచేయాల్సిన అవసరం ఏంటి?
గుండె పోటు అని ప్రచారం చేయడం మాత్రమే కాదు.. .. అలా నమ్మించడానికి సాక్ష్యాలను తుడిచేశారు. రక్తం మడుగు కడిగేశారు. వేలి ముద్రలు కనిపించకుండా చేశారు. పోలీసుల్ని రానివ్వలేదు. ఇంకా చెప్పాలంటే మృతదేహానికి కట్లు కట్టారు. అంతే కాదు.. అసలు పోస్టు మార్టం అవసరం లేదని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. అంత్యక్రియలు చేసేయాలనుకున్నారు. ఇదంతా ఎందుకు చేశారు ? ఎవరు చేశారు ? తాము దొరికిపోకూడదన్న భయంతోనే అంతా… హంతకులే చేశారు. ఇందులో లాజిక్కులు ఏముంటాయి ?
ఇలాంటి కేసులు కూడా చేధించకపోతే ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోతారు !
ఏదైనా నేరం జరిగితే… నిందితుడికి శిక్ష పడాలి. అతను బలవంతుడని … బయట తిరగగలిగితే.. ఇక జనం అంతా భయంతో వణికిపోవాల్సిందే. అలా జరిగితే.. దేశంలో చట్టానికి విలువేముంటుంది ? కానీ దురదృష్టవశాత్తూ ఏపీలో అదే జరుగుతోంది. ప్రజలకు చట్టం. … న్యాయంపై నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడింది. దీన్ని దర్యాప్తు సంస్థలే మళ్లీ నిలబెట్టాల్సి ఉంది.