వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో వివేకా హత్య రేపిన చిచ్చు తీవ్రమైనట్లుగా కనిపిస్తోంది. ఇంత కాలం వైఎస్ ఫ్యామిలీలో ఎవరి పేరూ బయటకు రాలేదు. కానీ డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ తర్వాత అవినాష్ రెడ్డి సహా పలువురు కుటుంబసభ్యుల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో అవినాష్ రెడ్డికి మద్దతుగా వైసీపీ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వారితో పాటు జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి కూడా కొత్త ప్రకటనలు ఇస్తున్నారు. అవినాష్ రెడ్డికి మద్దతు ఇస్తూనే.. ఇంకా పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందని ప్రకటిస్తున్నారు.
వివేకా హత్య కేసు విషయంలో వైఎస్ ఫ్యామిలీలో మొదటి నుంచి చీలిక వచ్చిందనేది చాలా మంది చెబుతున్న మాట. ఎక్కువ మంది వైఎస్ వివేకా కుమార్తె సునీతకు మద్దతుగా నిలిచారు. అయితే అవినాష్ రెడ్డి కుటుంబానికి అండగా జగన్ ఉన్నారన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో సీబీఐ దర్యాప్తు జరుగుతూండటం… మెల్లగా అవినాష్ రెడ్డి పేరు బయటకు వస్తూండటంతో ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. వివేకా హత్య కేసు వెనుక అవినాష్ రెడ్డి కాదని.. ఇంకాపెద్ద వ్యక్తులు ఉన్నారని చెప్పడం ద్వారా రవీంధ్రనాధ్ రెడ్డికి ఇంకా ఎక్కువ సమాచారం తెలుసన్న అభిప్రాయం కల్పించారు. వివేకా హత్య వెనుక ఇంకా ఏదో జరిగిందన్న అభిప్రాయం మాత్రం బలంగా ప్రజల్లోకి వెళ్లేలా చేశారు.
ఇప్పటికైతే సీబీఐ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్ ద్వారానే విచారణ జరుపుతోంది. ఈ విచారణ అవినాష్ రెడ్డి దగ్గరకు చేరే సరికి ఆ కుటుంబం నుంచి మరింత మంది తెర ముందుకు వచ్చే అవకాశం ఉంది. న్యాయం కోసం పోరాడుతున్న సునీత ఈ విషయంలో సైలెంట్‌గా ఉండే అవకాశాలు లేవు. ఆమె అసలు హంతకులను పట్టించే వరకూ ఆగరు. అదే సమయంలో కమలాపురం ఎమ్మెల్యే కూడా ఆమె వాదనతో ఏకీభవిస్తున్నారు. సాక్ష్యాలు తుడిచేశారని.. దీని వెనుక ఏదో ఉందని అంటున్నారు.
మొత్తంగా చూస్తే వైఎస్ ఫ్యామిలీలో అవినాష్ రెడ్డిని రక్షించాలన్న తాపత్రయంతో ఉన్న ాళ్లు చురుకుగా బయటకు వస్తున్నారు. అలాంటి వారు వైసీపీలో ఉన్నారు. మిగతా వారు… సీబీఐ దర్యాప్తు ను సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. ఎలా చూసినా ప్రస్తుతం వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉందని .. అది ఏ క్షణమైనా వైఎస్ కుటుంబంలో పేలిపోవచ్చని అంచనా వేస్తున్నారు.