వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు అధికారి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ను విచారణ నుంచి తప్పించింది. సీబీఐ డీఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వంలో ప్రత్యేకంగా సిట్ నియమించింది. ఈ సిట్‌లో ఆరుగురు ఇతర సభ్యులు ఉన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో విస్తృతమైన కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా వెలికి తీయాలని సుప్రీంకోర్టు సీబీఐ సిట్‌ను ఆదేశించింది. ఇప్పటి వరకూ సీబీఐ చేసిన విచారణను పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా సుప్రీంకోర్టు తెలిపింది.
డీఐజీ చౌరాసియా నేతృత్వంలో సీనియర్ అధికారులు పని చేయనున్నారు. త్త సిట్‌లో ఐపీఎస్ అధికారి, ఎస్పీ వికాస్ కుమార్, అడిషన్ ఎస్పీ ముఖేష్ శర్మ, ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీమతి, మరో ఇన్స్పెక్టర్ నవీన్ పునియా, సబ్ ఇన్స్పెక్టర్ అంకిత్ యాదవ్ సభ్యులుగా ఉండనున్నారు. ఏప్రిల్ 30లోగా విచారణ ముగించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా ట్రయల్ మొదలుకాకపోతే ఈ కేసులో ఏ5 నిందితుడు బెయిల్ కోసం దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. ఏ-5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో భాగంగానే సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం రాంసింగ్ పర్యవేక్షణలో విచారణ ఆలస్యమవుతోందని ఆయనను తొలగించాలని గత విచారణలో సూచించింది. గత విచారణలో అవసరమైతే రాంసింగ్‌ను ఉంచండి.. రాంసింగ్‌కు అదనంగా మరో అధికారిని కూడా నియమించండి ధర్మాసనం తెలిపింది. అయితే ఈరోజు మరో అధికారిని నియమిస్తూ సీబీఐ నివేదిక ఇచ్చిన క్రమంలో రాంసింగ్‌ను కొనసాగించడంపై సుప్రీం తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీంతో కొత్త సిట్ ప్రతిపాదనను సుప్రీం కోర్టు ముందు ఉంచారు. కొత్త సిట్ ఏర్పాటును ధర్మాసనం అంగీకరించింది.