వివేకా హత్య కేసు నిందితుల్ని రక్షించడానికి ఏపీ పోలీసులు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. నిందితులతో కలిసి పూర్తి స్థాయిలో ఏపీ పోలీసులు కుమ్మక్కయ్యారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. వివేకా హత్య కేసులో నిందితుడైన ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణలో సీబీఐ.. సుప్రీంకోర్టు దృష్టికి కీలక విషయాలను తీసుకెళ్లింది.
వివేకా హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి కీలకమైన వ్యక్తి అని బయట ఉండటం వల్ల సాక్షులను మాత్రమే కాదు విచారణాధికారులను కూడా బెదిరిస్తున్నారని సీబీఐ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.గంగిరెడ్డి బయట ఉంటే సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉందని.. సాక్షులను రక్షించుకోవాలంటే బెయిల్ రద్దు చేయాల్సిందేనని ధర్మాసనాన్ని కోరింది. నిందితులు, పోలీసులు కుమ్మక్కయ్యారన్న సీబీఐ వాదనలు పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని గంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 14కు వాయిదా వేసింది.
ఏపీలో పోలీసుల వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదం. ఇప్పుడు సీబీఐ అధికారులే నేరుగా.. వివేకా హత్య కేసులో నిందితులతో కుమ్మక్కయ్యారని.. వారి అండతోనే దర్యాప్తు జరగనీయలేదని చెప్పడం పెను సంచలనం అవుతోంది. ఈ విషయంపై సీబీఐ సుప్రీంకోర్టుకు ఆధారాలు సమర్పిస్తే.. పోలీసుల పరువు దేశవ్యాప్తంగా పోతుంది. ఓ హత్యకేసు నిందితులకు సహకరించిన పోలీసులుగా చరిత్రలో నిలిచిపోతారు. వివేకా హత్య కేసుల వ్యవహారం మెల్లగా సుప్రీంకోర్టుకు చేరుతుంది. అక్కడే సంచలన విషయాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఈ కేసులో అసలు నిందితులు కాకుండా వారిని తప్పించేందుకు సహకరిస్తున్న పోలీసులు కూడా బలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.