గత నెలాఖరున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది! ఉత్తరాంధ్ర ప్రజల ఆశల్ని అర్థం చేసుకున్నామనీ, అందుకే రైల్వే జోన్ ఇస్తున్నామంటూ ప్రకటించారు. అంతేకాదు, విశాఖను తాము చాలా అభివృద్ధి చేశామనీ, జోన్ ఇచ్చిన ఘనత భాజపాకి దక్కిందనీ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. విశాఖ స్మార్ట్ సిటీకి చాలా నిధులు ఇచ్చామన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను మరింత విస్తరిస్తామన్నారు. విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించిన ఘనత కూడా భాజపాకి దక్కుతుందనీ ప్రధాని చెప్పారు. విశాఖ సభ అనంతరం నగరంలో భాజపా నేతలు కొద్దిరోజులపాటు హడావుడి చేశారు. స్థానిక మీడియాలో హల్ చల్ చేస్తూ… రాబోయే ఎన్నికల్లో భాజపాకి విశాఖలో గొప్ప ఆదరణ లభిస్తుందనే ధీమాతో కనిపించారు.
అయితే, ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో విశాఖలో కమలనాథుల హడావుడే కనిపించడం లేదు. విశాఖలో కొంత ప్రభావం చూపే దిశగా పార్టీ వ్యూహాలు కూడా పక్కాగా ఉంటాయని అనుకుంటే… రానురానూ భాజపా జోష్ చల్లారిపోయినట్టుగా కనిపిస్తోంది. విశాఖలో ఎంపీ కంభంపాటి హరిబాబు ఉన్నారు. ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఉన్నారు. గత ఎన్నికల్లో వైయస్ సతీమణి విజయమ్మ మీద భారీ మెజారిటీతో హరిబాబు గెలిచారు. కానీ, తాజా ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేదా అనే అనుమానం వ్యక్తమౌతోంది. అంతేకాదు, విశాఖలో భాజపా తరఫున సీరియస్ గా పనిచేసే నాయకులు ప్రస్తుతం లేరనే చెప్పాలి. కొత్తవారూ కనిపించడం లేదు.
దక్షిణాదిలో భాజపా బలపడేందుకు కావాల్సిన పునాదులు ఆంధ్రా నుంచి పడతాయంటూ ఈ మధ్యనే ఎంపీ జీవీఎల్ నర్సింహారావు చెప్పారు! రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో తమ పాత్ర కీలకంగా మారుతుందంటూ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చాలాసార్లు చెప్పారు! అయితే, ఇవన్నీ కేవలం మైకుల ముందు ప్రకటనలుగా మాత్రమే కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలోగానీ, అభ్యర్థులను అన్వేషించే విషయంలోగానీ రాష్ట్ర నాయకత్వం చొరవ తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. జాతీయ నాయకత్వానికి కూడా తత్వం బోధపడ్డట్టుగానే కనిపిస్తోంది. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించేస్తే… అక్కడ ఊపు వచ్చేస్తుందని అనుకుని ఉంటారు. సాక్షాత్తూ ప్రధాని వచ్చి మరీ స్వయంగా జోన్ ప్రకటించినా… ప్రజల నుంచి స్పందన రావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికైనా భాజపా నేతలు అర్థం చేసుకుంటే మంచిది.