అమ్మాయిని చూడటానికి వచ్చిన అబ్బాయి… ఆ అమ్మాయి నచ్చలేదని వాళ్ల చెల్లి నచ్చిందని చెప్పడం.. సినిమాల్లో చూస్తూ ఉంటాం. సినిమాల్లో వాటిని జోవియల్గా చూపిస్తారేమో కానీ… నిజ జీవితంలో జరిగితే మాత్రం.. మానసిక కల్లోలాలకు కారణం అవుతాయి. విశాఖలో జరిగిన అలాంటి ఘటన ఒకటి అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపింది.చివరికి హత్యకు కారణం అయింది. విశాఖలో జరిగిన తమ్ముడిని చంపిన అన్న కేసులో ఇదే అసలు కోణం.
అది ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం. ఇద్దరు అబ్బాయిలతో తల్లిదండ్రులు జీవనం సాగిస్తున్నారు. వారిద్దరూ యుక్త వయసుకు వచ్చారు. ముందు పెద్దవాడికి పెళ్లి చేయాలి కాబట్టి ఆ తల్లిదండ్రులు ఓ అమ్మాయిని చూశారు. పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేశారు. ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. నిశ్చితార్థం కూడా చేశారు. తర్వాత ఏమయిందో కానీ ఆ అమ్మాయి… తనకు నిశ్చితార్థం అయిన వ్యక్తి వద్దని.. తనకు వాళ్ల తమ్ముడంటే ఇష్టమని.. అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. పెద్దలు చాలా చెప్పి చూసినా మారలేదు. దీంతో అన్నతో చేసిన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసి.. తమ్ముడితో నిశ్చితార్థం చేశారు. అమ్మాయే వద్దనుకున్నప్పుడు తామేం చేస్తామని ఆ తల్లిదండ్రులు.. పెద్దవాడికి సర్ది చెప్పారు.
కానీ నిశ్చితార్థం అయిన అమ్మాయి తిరస్కరణ… ఆ పెద్దోడి మనసుపై గట్టిగానే పడింది. అప్పట్నుంచి తమ్ముడితో పగతో రగిలిపోయేవాడు. చీటికిమాటికి గొడవలు పెట్టుకునేవాడు. ఆ కోపం అసహనం స్థాయికి చేరి.. మరో చిన్న వివాదంతో కత్తితో పీక కోసి చంపేసేంత స్థితికి చేరింది. దీంతో తమ్ముడు ప్రాణం పోయింది. ఆ యువకుడు జైలు పాలయ్యాడు. ఆ తల్లిదండ్రులు… ఇప్పుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విశాఖ జిల్లాఅచ్యుతాపురం మండలం పూడిమడకలో ఈ హత్య జరిగింది.
పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కూడా ఇప్పుడు అన్యాయం అయిపోయింది. మొదట అన్న సంబంధాన్ని వద్దనుకుంది. ఇప్పుడు తమ్ముడు హత్యకు గురయ్యాడు. ఎవరూ దక్కకుండా అయిపోయారు.