విశాఖపట్నం ఒక్క సారిగా ఉలిక్కి పడింది. గాల్లో కలిసిపోయిన గ్యాస్ తమ జీవితాలను అల్ల కల్లోలం చేయబోతోందని.. ఆనందపురం చుట్టుపక్కల గ్రామాలు ఆ క్షణాన అనుకోలేకపోయాయి. ఇళ్లలో ఉన్న తాము ఎందుకు అచేతనంగా మారిపోతున్నామో ఆలోచించలేని పరిస్థితి. రోడ్డు మీదకు వెళ్లినవారు.. ఎక్కడికక్కడ కుప్పకూలిపోయిన దుస్థితి. ఆనందపురం ప్రాంతంలో గురువారం నాటి దృశ్యాలు చూస్తే.. గతంలో జరిగిన భోపాల్ గ్యాస్ ప్రమాదం గుర్తుకు రాక మానదు. ఓ తరం ముందు జరిగిన అ ప్రమాదం గురించి ఇప్పటికీ కథలు.. కథలుగా చెప్పుకుంటారు. కానీ ఇది అంత తీవ్రమైనది కాదు. కానీ.. దీర్ఘ కాలిక సమస్యలు తెచ్చి పెట్టే ప్రమాదమే.
మహాప్రళయం నుంచి బయటపడిన విశాఖ..!
ఎల్జీ పాలిమర్స్ సంస్థ పాస్టిక్ ఉత్పత్తులకు కావాల్సిన ముడిపదార్థాలను ఇతర పాస్టిక్ తయారీ పరిశ్రమల కోసం సరఫరా చేస్తుంది. ఈ సంస్థకు ప్రధాన ముడి సరుకు స్టైరిన్. ఈ స్టైరిన్ ను నిల్వ చేయడానికి … ఇండియన్ ఆయిల్ పెట్రోల్ నిల్వ కేంద్రాల్లో ఉండే ట్యాంకుల్లాంటివాటిని కంపెనీ నిర్మించింది. ఆ ట్యాంకుల నుంచి స్టైరిన్ లీక్ అయింది. నిజానికి ఇది లిక్విడ్ గ్యాస్. లిక్విడ్ రూపంలో ఇది.. ప్రమాదకరం కాదు. గ్యాస్ రూపంలోకి మారితే మాత్రం… చిన్నారులు, వృద్ధులకు ప్రాణాంతకం అవుతుంది. గ్యాస్ రూపంలోకి మారకుండా.. కావాల్సింత స్టైరిన్ ఉపయోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు సంస్థలో ఉంటాయి. ఉండాలి కూడా. కానీ ఆ ట్యాంక్ నుంచి.. గ్యాస్ రూపంలోనే స్టైరిన్ బయటకు వచ్చింది. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే..గాల్లో కలిసిపోతున్న విషవాయువు ప్రభావాన్నితగ్గించే విరుగుడు రసాయనాలతో న్యూట్రలైజేషన్ ఏర్పాట్లు ఉండాలి. అలాగే అలారం వ్యవస్థ ఉండాలి. ఇవేమీ.. కంపెనీ ఉపయోగించలేదు. ఫలితంగా.. ఈ దారుణం చోటు చేసుకుంది. అదే స్టైరిన్ కాకుండా… మరో ప్రమాదకర రసాయనం ఏమైనా ఉండి ఉంటే… భోపాల్ కన్నా పెద్ద ట్రాజెడి విశాఖలో నమోదయ్యేది. అప్పుడు.. ఏడవడానికి కూడా తెలుగువారికి కన్నీరు మిగిలి ఉండేది కాదు.
రసాయన పరిశ్రమలో కనీస జాగ్రత్తలు ఏవి..?
ఎల్జీ పాలిమర్స్ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు అంతర్జాతీయ సంస్థే. సామాన్యుల ఇళ్లలో కనిపించే ఎల్జీ బ్రాండ్ ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేసే బ్రాండే ఎల్జీ. ఆ గ్రూప్‌నకు చెందినదే ఈ ఎల్జీ పాలిమర్స్. అందుకే ముఖ్యమంత్రికి అదో పెద్ద మల్టినేషనల్ కంపెనీలా అనిపించి ఉండవచ్చు. 1978లో విజయ్ మాల్యాకు చెందిన యూబీ గ్రూప్ తీసుకుంది… వారి నుంచి 1997 జులైలో ఎల్జీ గ్రూప్ కొనుగోలు చేసింది. విజయ్ మాల్యా ఈ కంపెనీని కొనడానికి ప్రధాన కారణం.. తమ మద్యాన్ని అమ్ముకోవడానికి అవసరమైన ప్లాస్టిక్ బాటిళ్లను సొంతంగా తయారు చేసుకునే ఉద్దేశమే. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ కూడా.. మద్యం కంపెనీల ప్లాస్టిక్ బాటిళ్లు సరఫరా చేసే కంపెనీలకే ఎక్కువ ముడి సరుకు పంపుతుంది. ఇది రసాయనాలతో నడిచే పరిశ్రమ కాబట్టి.. నియమ నిబంధనలు కఠినంగా ఉంటాయి. నివాస గృహాలకు దూరంగా ఉండాలి. కానీ… ఇప్పుడు ఈ పరిశ్రమ చుట్టూ… కొన్ని వందల కాలనీలు ఏర్పడ్డాయి. ఐదు కిలోమీటర్ల పరిధిలో… కనీసం నాలుగైదు లక్షల మంది నివస్తున్నారు. ఒక్క సారి ప్రమాదం జరిగిదే…. అందరిపై ఎఫెక్ట్ పడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా.. పరిశ్రమను దూరంగా అయినా తరలించాలి.. లేదా.. అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించాలి. రెండింటిలోఒక్కటీ చేయలేదు.. ఎల్జీ పాలిమర్స్.
రసాయన పరిశ్రమలో కనీస జాగ్రత్తలు లేకపోవడం ఎవరి తప్పిదం…?
రసాయన పరిశ్రమ అన్న తర్వాత … అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకోవాల్సిన బాధ్యత కంపెనీపై ఉంది. తీసుకుందో లేదో పరిశీలించాల్సిన బాధ్యత.. సంబంధిత ప్రభుత్వ విభాగంపై ఉంటుంది. కానీ.. ప్రమాదం జరిగిన ఎల్జీ పాలిమర్స్‌లో కనీసం.. అలారం మోగలేదంటే… అసలు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేవని అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి కూడా… అలారం మోగలేదని.. మనసు కలచి వేస్తోందని ప్రకటించారు కానీ.. కంపెనీలో పరిస్థితి ఇంత దారుణంగా ఉందని… అంగీకరించలేకపోయారు. ప్రమాదం తర్వాత జరిగిన ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు కొన్ని అంశాలు తెలుసుకున్నట్లుగా ప్రచారం జరిగింది.. వాటి ప్రకారం… కంపెనీ నిర్వహణలో అత్యంత కీలకమైన మెంటెనెన్స్ స్టాఫ్ సరిగా లేరు. గ్యాస్ ను భద్ర పరచడంలోనూ స్పష్టమైన సేఫ్టీ మెజర్స్ లేవు. అతిముఖ్యమైన కూలింగ్ సిస్టం సరిగా పని చేయడం లేదు. ఇప్పటికే ఈ కంపెనీ పర్యావరణ పరణమైన నిబంధనల్ని పాటించలేదనే లీగల్ ఇష్యూ ప్రభుత్వంతోనే నడుస్తోంది. ఇన్ని లోపాలున్నా.. కంపెనీ తన మానాన తను ..ఆ ఏం జరుగుతుందిలే అన్న నిర్లక్ష్యంతో పని చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో.. అటు ప్రభుత్వ యంత్రాంగం.. ఇటు పరిశ్రమ యాజమాన్యం.. ప్రజల ప్రాణాల పట్ల కనీస బాధ్యత కూడా చూపించలేదు.
అధికారులను సంతృప్తి పరచడమే భద్రతా ఏర్పాట్లు తీసుకున్నట్లా..?
పరిశ్రమలో సేఫ్టీ మెజర్స్ ఎవరి కోసం చేస్తారు..? కంపెనీలో పని చేసే ఉద్యోగుల కోసం చేస్తారు. ప్రమాదం జరిగితే వాటి బారిన పడి.. నష్టపోకుండా… చుట్టుపక్కల ప్రజలను రక్షించేందుకు చేస్తారు. కానీ ప్రస్తుతం భారతదేశంలో కంపెనీలు.. అలా అనుకోవడం లేదు. చట్టాల ప్రకారం..భద్రతా ఏర్పాట్లు లేకపోయినా.. ఉన్నాయో లేదో.. పరిశీలించడానికి వచ్చే అధికారిని గౌరవంగా చూసుకుంటే.. అదే తమకు పెద్ద భద్రత అనుకుంటున్నారు. దాంతో.. ఆ అధికారుల్ని మెప్పించి.. నిబంధనలకు వ్యతిరేకంగా తమ పని తాము చేసుకుంటున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత సదరు ఎల్.జి. కంపెనీ ప్రతినిథులు మీడియాతో చాలా క్యాజువల్ గా జరిగిన విషయంగా చెప్పుకొస్తున్నారు. వారెవరూ ఆందోళన చెందడం లేదు. అందరూ ఊళ్లు విడిచి వెళ్లాలని సలహా ఇస్తున్నారు. పైగా తప్పు.. లాక్ డౌన్ మీద నెట్టేస్తున్నారు. కంటిన్యూగా సిస్టమ్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారు. నిజానికి…ఇలాంటి పనులకు పాసులు ఇస్తోంది ప్రభుత్వం. వారికీ ఇచ్చింది. కానీ ఉపయోగించుకోలేదన్న విషయం స్పష్టమయింది.
కోటి కాదు వంద కోట్ల పరహారం ఇచ్చినా నష్టం భర్తీ చేసినట్లు ఎలా అవుతుంది..?
ప్రమాదం జరిగిన తర్వాత సీఎం వేగంగా విశాఖకు వచ్చారు. కరోనా ప్రభావం వచ్చిన తర్వాత ఆయన ఒక్క సారి కూడా బయటకు రాలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ బయటకు వచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించారు. మిగలిన వారకీ ప్రకటించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతీ ఒక్కరికీ రూ. పదివేలు ఇస్తామన్నారు. ఈ నిర్ణయాల పట్ల ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రెస్మీట్లో ఆయన కంపెనీపై సానుకూలంగా మాట్లాడటమే అందర్నీ విస్మయపరిచింది. ఎందుకంటే.. తప్పు చేసిన కంపెనీని శిక్షించాలా వద్దా.. అన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఆ కంపెనీ త్వరలో ప్రారంభమవుతుందన్న సంకేతాలు ఇచ్చి..అందులో బాధితులకు ఉద్యోగాలిస్తామని కూడా చెప్పుకొచ్చారు. కానీ.. చేసిందంతా చేసేసి ఇలా పరిహారం ఇప్పించడం.. ఎప్పటికీ నష్టపరిహారం కోటాలోకి రాదు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే. దురదృష్టవశాత్తూ..దేశంలో ఇప్పటి వరకూ ఇలాంటి తప్పిదాలపై ఎవరికీ శిక్షలు పడిన దాఖలాల్లేవు. అందుకే.. వ్యవస్థలో నిర్లక్ష్యం పేరుకుపోతోంది. తప్పు చేసిన వారికి శిక్షలు పడాలి… అప్పుడే.. మరోసారి అలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. ఆ భయం ఉంటేనే… తమ పరిశ్రమలో మరొకరు తనిఖీ చేయకుండానే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు. మరోసారి అలాంటి నష్టం రాకుండా చూసుకోవడమే… అసలైన నష్టపరిహారం. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయడం లేదని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
పరిశ్రమలు నిజాయితీగా రక్షణ చర్యలు చేపట్టవా..? వ్యవస్థలో నిర్లక్ష్యం ఇంకెంతకాలం..?
పరిశ్రమలు… చట్ట ప్రకారం.. తాము చేపట్టాల్సిన చర్యలన్నీ చేపట్టాలి. నిజానికి పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు.. చట్టం ప్రకారమే చేపట్టాల్సిన పని లేదు. తమ పరిశ్రమ నిర్వహణ ఎంత ప్రమాదకరమో.. ఏదైనా ప్రమాదం జరిగితే.. ఎలా ఉద్యోగుల్ని, చుట్టుపక్కల వారిని కాపాడుకునేలా.. రక్షణ చర్యలు తీసుకోవాలి.దీనికి చట్టాలు అక్కర్లేదు. కానీ.. చట్టం చెప్పలేదు.. చట్టాన్ని పర్యవేక్షించేవారిని కొనేశాం కాబట్టి.. ఎలాంటి రక్షణ పరికరాలు.. చర్యలు అవసరం లేదన్నట్లుగా… ప్రస్తుత పరిశ్రమల తీరు ఉంది. ఇది ఎలా ఉందంటే.. కాపలాదారు లేరని.. సొంత కంపెనీలోనే దొంగతనం చేసుకుంటున్నట్లుగా పరిస్థితి ఉంది. అది ఎల్జీ పాలిమర్స్ విషయంలో రుజువైంది. ఇలాంటి ప్రమాదాలన్నీ.. నిర్లక్ష్యం.. బాధ్యతారాహిత్యం కారణంగానే జరుగుతూంటాయి. ఇది కచ్చితంగా మానవ తప్పిదమే. ఈ మానవతప్పిదం.. సహజంగా ఉండే నిర్లక్ష్యం వల్ల వస్తుంది. దీన్ని ఎప్పుడు అయితే అధిగమిస్తారో.. అప్పుడే.. సామాన్య ప్రజలు బలిపశువులు కాకుండా ఉంటారు. అలాంటి పరిస్థితి మన దేశంలో… వస్తుందని మనం ఊహించగలమా..? నమ్మగలమా..?