ఉదయమే వాకింగ్‌కి వెళ్లిన వారికి కళ్లు తిరుగుతూంటే ఏమైందో అర్థం కాలేదు. ఒక్కరికి కాదు.. ఆ ప్రాంతంలో నడుస్తున్న వారు.. వెహికల్స్‌పై వెళ్తున్న వారు.. కారులో వెళ్తున్న వారు.. అందరికీ అదే ఫీలింగ్. కానీ అందరికీ అలా ఉందని.. ఒకరికొకరికి తెలియని పరిస్థితి. అందుకే.. అక్కడంతా ఎక్కడివారక్కడ కుప్పకూలిపోయారు. కొంచెం దూరంగా.. ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ట్యాంకర్ నుంచి పొగలాంటి గ్యాస్ ఎగసి పడుతూండటమే వారికి లీలగా గుర్తుంది.
ఆనందపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్ల మీద.. కాలువల్లో… ఫుట్ పాత్లపై ఇలా ఎక్కడ చూసినా ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న మనుషులే కనిపించారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే చాలా నష్టం జరిగిపోయింది. ప్రమాదకర గ్యాస్ లీకేజీ అని తెలుసుకున్న తర్వాత అధికారులు హడావుడిగా.. ముందు జాగ్రత్తలు ప్రారంభించారు. అందుబాటులో ఉన్న అంబులెన్స్ అన్నింటినీ ఆనందపురం ప్రాంతానికి తరలించి… అపస్మారక స్థితిలో ఉన్న వారందర్నీ.. ఆస్పత్రికి తరలించారు.
అయితే.. ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో భయానక పరిస్థితి ఏర్పడింది. వృద్ధులు, చిన్న పిల్లలు ఆ గ్యాస్‌ను ఎక్కువగా పీల్చుకోవడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చాలా మందిలో చలనం లేకుండా పోయింది. స్టైరైన్ అనే వాయువు లీక్ అయిందని… ప్రాథమికంగా నిర్ధారించారు. ఇది వెంటనే ప్రాణం తీసే వాయువు కాదు. కానీ ప్రమాదకమైన వాయువే. ఈ గ్యాస్ వల్ల తొలుతగా తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్ళు మంటలు, వస్తాయి, ఇదే గ్యాస్ ను ఎక్కువగా పిలిస్తే క్యాన్సర్, కిడ్నీ వంటి వ్యాధులతో బాధ పడే అవకాశం ఉంది. ఈ లక్షణాలన్నీ అక్కడి బాధితులకు ఉన్నాయి. ఇప్పుడు లీక్ అయిన వాయువు గాఢత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ప్రమాద తీవ్రత పెరిగిందని అంటున్నారు. అందుకే తక్షణం విరుగుడు చర్యలు ప్రారంభించారు.
స్టైరైన్ దెబ్బకు చుట్టుపక్కల చెట్లు అన్నీ ఎండిపోయాయి. మూగ జీవాలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయాయి. గేదెలు, పెంపుడు కుక్కలు కూడా.. ఈ గ్యాస్‌ను పీల్చుకుని తట్టుకోలేకపోయాయి. ఆకాశంలోనూ మార్పులు కనిపించాయి. ఇంత జరుగుతున్నా… పరిశ్రమ యాజమాన్యం.. ఆ రసాయనాల లీకేజీ గురించి పూర్తి సమాచారం వెల్లడించలేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పలేదు. బాధితులతో విశాఖ కేజీహెచ్ నిండిపోయింది.