విశాఖపట్టణం సిద్ధమవుతోంది. విశాఖపట్టణం పేరు తలచుకోగానే క్రికెట్ మ్యాచ్లు గుర్తుకొస్తాయి. ఏపీలో అంతర్జాతీయ క్రికెట్ పోటీలు నిర్వహించే నగరం విశాఖ మాత్రమే. కాని ఇప్పుడు విశాఖ సిద్ధమవుతోంది అంతర్జాతీయ క్రికెట్ కోసం కాదండి. సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల కోసం. లెజిస్లేటివ్ కేపిటల్గా అమరావతి, ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా విశాఖ, జ్యుడీషియల్ కేపిటల్గా కర్నూలును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే కదా. ఈ ప్రతిపాదనపై అమరావతిలో దుమ్ముదుమారం రేగుతూ పెద్దఎత్తున ఆందోళనలు సాగుతుండటం, నిరసనలు చెలరేగుతుండటం చూస్తున్నాం. ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల చర్చ తప్ప మరో విషయం గురించి ఎవరూ మాట్లాడుకోవడంలేదు. రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుందా? మూడు రాజధానులు ఉంటాయా? అనే విషయం ఈ నెల 27న జరిగే కేబినెట్ సమావేశంలో తేలిపోతుందని అందరూ అనుకుంటున్నారు.
మీడియాతో మాట్లాడిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని విషయం 27వ తేదీన ఫైనలైజ్ అవుతుందని చెప్పారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అవుతుందని జగన్ చెప్పిన నేపథ్యంలో కేబినెట్ మీటింగ్ కూడా అక్కడే జరగవచ్చని, అదే మీటింగ్లో జగన్ చేసిన ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడవచ్చని అనుకుంటున్నారు. అమరావతి ప్రాంతంలో ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నందున కేబినెట్ విశాఖలో పెడతారని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వ ఆలోచనలకు తగినట్లే విశాఖ జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ప్రకటించగానే అందుకు అవసరమైన భూసేకరణ చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది.
విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటిస్తే అక్కడ సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, అధికారులు, సిబ్బంది కోసం ఇళ్లు, క్వార్టర్లు, ఇంకా అవసరమైన నిర్మాణాలు చేయాలి. ఇందు కోసం సుమారు 300 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ భూమిని సేకరించడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఈ నిర్మాణాలు పూర్తయ్యేంతవరకు పరిపాలనా యంత్రాంగం తాత్కాలిక భవనాల్లో ఉండాల్సివస్తుంది. అందుకు అవసరమైన భవనాలను కూడా వెదకడానికి కూడా కసరత్తు సాగుతోంది. ఇప్పటికే కొన్ని భవనాలు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు.
ఇదిలావుండగా, విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెడితే ఉద్యోగుల్లో నిరసన వస్తుందని, ఇప్పటికే వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని కొన్ని పత్రికల్లో వార్తలొచ్చాయి. హైదరాబాదు నుంచి అమరావతి రావడానికే చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడిప్పుడే అక్కడ కుదురుకుంటున్న పరిస్థితిలో మళ్లీ విశాఖపట్నం పొమ్మంటే అనేక ఇబ్బందులు పడాల్సివస్తుందని వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ఉద్యోగులు విశాఖ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. విశాఖ వెళ్లడానికి ఉద్యోగులకు ఇబ్బంది లేదని, విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అధికారికంగా ప్రకటిస్తే ఉద్యోగులు అందుకు అనుగుణంగా సిద్ధమవుతారని చెప్పాడు. తాజాగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు మూడు రాజధానుల ప్రతిపాదనను బలపరిచేవిగా ఉన్నాయి.
‘అమరాతిలో వెళుతుంటే ఎడారిలో వెళుతున్నట్లుగా ఉంది’ అన్నారు. దీన్నిబట్టి విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అవుతుందనే అంచనాలు బలపడుతున్నాయి. మూడు రాజధానుల ప్లాన్ ఖరారైపోయిందని, అధికారికంగా నిర్ణయం తీసుకోవడమే మిగిలివుందని కొందరు భావిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టడాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించడంలేదు. అక్కడ హైకోర్టు పెట్టినంతమాత్రాన అది రాజధాని కాబోదు. హైదరాబాదు మాదిరిగా అభివృద్ధి చెందదు. కాబట్టి ఇప్పుడు తేలాల్సింది అమరావతి, విశాఖపట్టణమే. అసెంబ్లీ, సెక్రటేరియట్ ఒక్కచోటనే ఉంటాయా? చెరొక ప్రాంతంలో ఉంటాయా? 27వ తేదీ వరకు ఎదురుచూద్దాం.