హైదరాబాద్: కేసినోలలో గ్యాంబ్లింగ్ చేయాలనుకునే బిగ్ షాట్స్ ప్రస్తుతం ఇండియాలో అయితే గోవా, సిక్కిమ్, దమన్ వంటి ప్రదేశాలకు – విదేశాలలో అయితే లాస్ వేగాస్, మకావు, సింగపూర్ వెళుతుంటారు. అయితే వారు ఇక అంతదూరం వెళ్ళకుండానే సమీపంలోని విశాఖపట్నంలో త్వరలో కేసినోల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశ విదేశాలకు చెందిన కొన్ని కేసినో నిర్వాహక సంస్థలు దీనిపై ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయి.
కేసినోలవలన ఎంత హీనపక్షంగా చూసినా ప్రభుత్వానికి రు.300 కోట్ల ఆదాయం వస్తుందని ఒక అంచనా. ప్రస్తుతం ఇండియాలో పశ్చిమ భాగాన గోవా, దమన్ వంటి చోట్ల కేసినోలు ఉన్నాయిగానీ, తూర్పుతీరంలో లేవుకాబట్టి విశాఖపట్నంలో పెడితే బాగా క్లిక్ అయ్యే అవకాశాలున్నాయి. అందుకే మలేషియాకు చెందిన ఒక సంస్థ, గోవాకు చెందిన రెండు కేసినో సంస్థలు వైజాగ్‌లో పెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. ఇది మంచి అడుగేనని, వైజాగ్‌లో కేసినోల ఏర్పాటువలన నగరానికి ఒక అంతర్జాతీయ స్టేటస్ ఏర్పడుతుందని పారిశ్రామిక, వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేసినోలకోసం ఎక్కడెక్కడికో వెళ్ళేవారు ఇక్కడికి రావటంవలన టూరిజం బాగా పెరుగుతుందని వారంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే విశాఖపట్నంలో సెయిలింగ్, విండ్ సర్ఫింగ్, స్కూబా డైవింగ్, వాటర్ స్కీయింగ్, హోవర్‌క్రాఫ్ట్, సీప్లేన్స్, క్రూజ్ షిప్స్ వంటి వాటర్ స్పోర్ట్స్‌ను ప్రవేశపెట్టి టూరిజంను బాగా అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తోందని, కేసినోలుకూడా ఏర్పాటుచేస్తే నిధుల కొరతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉభయతారకంగా ఉంటుందని వ్యాపారవేత్తలు సూచిస్తున్నారు. ఈ కేసినోలలో అనేక రకాల జూదాలతోబాటు మద్యం, ఇతర వినోద కార్యక్రమాలు ఉంటాయి.