ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాను టిట్లి తుపాను.. సర్వం కోల్పోయేలా చేసింది. ఈ జిల్లాను కేంద్రం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అదే పనిగా డిమాండ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు నివేదికలు పంపి… తక్షణ సాయంగా రూ. 1200 కోట్లు ఇవ్వాలని పదే పదే లేఖలు రాస్తున్నారు. నష్టం అంచనాలకు కేంద్ర బృందాలను పంపాలని కోరుతున్నారు. అనుకున్నట్లుగానే.. కేంద్ర బృందాలు వచ్చాయి. అయితే అవి నష్టం అంచనాలకు వచ్చినవి కాదు. ఇన్ కంట్యాక్స్ సోదాలకు వచ్చిన బృందాలు. విశాఖకు భారీగా ఐటీ ఉన్నతాధికారుల బృందాలు చేరుకున్నాయనే సమాచారం రాష్ట్ర ప్రభుత్వ వర్గాలకు అందింది. తెలుగుదేశం నేతలను లక్ష్యంగా చేసుకుంటూ పెద్ద ఎత్తున ఐటీ దాడులు చేస్తారనే ప్రచారం అధికార పక్షంలో జోరందుకుంది.
కొన్ని రోజుల క్రితం రాజధాని ప్రాంతంలోని పరిసర జిల్లాల్లో దాడులు జరుగుతాయనే ఇదే తరహా సమాచారం ప్రభుత్వానికి రాగా.. అందుకు తగిన రీతిలోనే ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. తాజాగా విశాఖలో ఐటీ అధికారులు భారీగా దాడులు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విశాఖ పట్టణానికి నాలుగు రాష్ట్రాల నుంచి ఐటీ అధికారులు భారీగా చేరుకున్నట్లు సమాచారం. దాదాపు 50 మంది అధికారులు వివిధ మార్గాల ద్వారా ఒడిశా, తెలంగాణ, చెన్నై, బెంగళూరు నుంచి విశాఖ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఫిన్ టెక్ వ్యాలీగా, ఐటీ, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు ఐటీ అధికారుల రాక రాజకీయ కుట్రేనని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.
పెట్టుబడులు… రాకుండా చేసేందుకు .. భయభ్రాంతులకు గురి చేసేందుకు ఇలా దండులా వస్తున్నారని.. టీడీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఏదో ఓ కంపెనీ.. లేదా.. మరొకరు పన్నులు ఎగ్గొట్టినట్లు ఉంటే.. సోదాలు చేయడం ఓ ఎత్తు కానీ.. ఇలా.. వందల మంది.. అందర్నీ భయభ్రాంతులకు గురి చేసేలా.. దాడులు చేయడం మాత్రం… ఏదో తేడాగానే కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.