విశాఖపట్నంలో “అధికారిక సెటిల్మెంట్” జరిగినట్లుగా ఆరోపణలు వచ్చిన మర్రిపాలెం భూముల విషయంలో హైకోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ప్రభుత్వం ఆ భూమిని ఇతరులకు కేటాయించడం కానీ.. నిర్మాణాలు చేపట్టడం కానీ చేయవద్దని స్పష్టం చేసింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం జీవో జారీ చేసి మరీ.. ప్రభుత్వ స్థలం అంటూ.. మర్రిపాలెంలోని భూమిని స్వాధీనం చేసుకుంది. బోర్డులు పెట్టింది. ఇది ప్రైవేటు స్థలమని.. చెబుతూ.. ఆ స్థలం యజమానికి కోర్టులో పిటిషన్ వేశారు. మామూలుగా అయితే ఇది వివాదం అయ్యేది కాదు.. కానీ.. రూ. పది కోట్లు ఇస్తే.. స్థలం జోలికి రాబోమని.. ప్రభుత్వ పెద్దల పేరు చెప్పి.. కొంత మంది ఆ స్థల యజమానిని కొన్నాళ్ల కిందట బెదిరించడంతోనే విషయం హాట్ టాపిక్ అయింది.
మర్రిపాలెంలో జాతీయ రహదారిని ఆనుకొని సర్వే నంబరు 81/3లో 17,135 చదరపు మీటర్ల స్థలం లలితేష్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. జ్యోస్యుల నారాయణదాస్ అనే వ్యక్తి కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ఆస్తిని లలితేష్ కొనుగోలు చేశారు. ఈ జోస్యుల నారాయణదాస్ కుటుంబానికి చెందిన కొంత భూమిని మూడు, నాలుగు దశాబ్దాల కిందట.. అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం కిందట అప్పటి ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నాయి. తర్వాత మార్కెట్ రేటు కట్టి.. మళ్లీ తీసుకోవడానికి అనుమతి ఇచ్చాయి. ఈ అనుమతితో 2009లో డబ్బులు కట్టి.. 17,135 చదరపు మీటర్ల స్థలాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత లలితేశ్ అనే వ్యక్తికి అమ్మారు. అయితే… ప్రభుత్వం ఈ స్థలాన్ని జోస్యుల కుటుంబానికి అప్పగించే సమయంలో నిబంధనలు పాటించలేదని చెప్పి.. ఇప్పుడు భూమిని స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం.
ప్రభుత్వం మారిన తర్వాత లలితేష్కు చెందిన భూమి వ్యవహారాల్ని చూస్తున్న ఆయన బంధువు సింబయాసిస్ సంస్థ సీఈవో నరేశ్ ఇంటికి పులివెందులకు చెందిన బాలనారాయణరెడ్డి, లింగాల రామలింగారెడ్డి వెళ్లి రూ.10 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. ఆ స్థలం వివాదంలో ఉందని.. రూ. పది కోట్లు ఇవ్వకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించి వెళ్లారు. నరేష్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ మీడియాకు విడుదల చేశారు. కొన్నాళ్ల తర్వాత ప్రభుత్వం స్వాధీన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వంపై న్యాయపోరాటానికి నరేష్, లలితేష్ సిద్ధమయ్యారు.