ఎపి ఆర్థిక పారిశ్రామిక రాజధాని విశాఖజిల్లాలో లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణాలు జరిగాయన్నది ఇప్పుడు తీవ్ర రాజకీయ రణంగా మారిపోయింది. వైసీపీ, వామపక్షాలతో సహా నిర్వహించిన సేవ్ విశాఖ మహాధర్నా నిజంగానే ప్రజల ఆందోళనలకు అద్దం పడుతున్నది. తెలుగు360లో గత ఏడాదిలోనే విశాఖ భూములను కాపాడుకోవలసిన అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నాం. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుల బృందాలు నిరాఘాటంగా తమ నిర్వాకాలు సాగించాయి. వీటిపై సిపిఎం కాంగ్రెస్ వైసీపీ వంటి పార్టీలు ఎన్నిసార్లు విమర్శలు చేసినా పెడచెవిని పెట్టాయి.ఆఖరుకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బయిటపెట్టాక- మంత్రి అయ్యన్న పాత్రుడే బహిరంగంగా విమర్శించిన తర్వాతా- ఇంకా కప్పిపుచ్చడం ఎవరి వల్లా కాలేదు. అయినా శక్తికొద్ది తంటాలు పడి సిట్ ప్రహసనం జరిపించారు గాని సమస్య సద్దుమణిగే అవకాశం లేదు. ఇదే సమయంలో హైదరాబాదులోనూ భూ దందాలు బయిటకు రావడం పరిస్థితిని ఇంకా క్లిష్టం చేసింది.
ప్రజలకు ప్రతిపక్షాలకూ నమ్మకం కలిగించేలా ప్రభుత్వం ఏమైనా ప్రత్యక్ష చర్యలు తీసుకుంటే తప్ప విశాఖలో మొదలైన ఆందోళన ఆగకపోవచ్చు. పైగా భూముల బాధితులలో మధ్యతరగతి వారు గ్రామీణులు ఆదివాసులు కొందరు వ్యాపారులు అన్ని తరగతుల వారూ వున్నారు. ఇప్పుడే దీన్ని అడ్డుకోకపోతే విశాఖ తమకు దక్కకుండా పోతుందనే భయం కూడా వ్యక్తమవుతున్నది.విభజన తర్వాతనే తమకు ఈ బెడద పెరిగిందని కూడా చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత జగన్ ప్రత్యక్షంగా వచ్చి ధర్నా చేయడం, అన్ని ప్రతిపక్షాలూ సహకరించడంతో ఈ సమస్య ఉద్యమంగా మారనుంది.ఈ వూపులోనే గత ప్రభుత్వాల హయాంలో జరిగినవి కూడా వెలికి తీయొచ్చు.