గ్రేటర్ విశాఖ మేయర్ పై కూటమి నేతలు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. కలెక్టర్ వద్దకు వెళ్లి ఈ నోటీసులు ఇచ్చారు. ఆయన రేపోమాపో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించడంతో మెజార్టీ కోల్పోయారు. వైసీపీ మేయర్ తప్పక రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
విశాఖ గ్రేటర్ కార్పొరేషన్లో ప్రస్తుత బలం ప్రకారం విశాఖపట్నం, అనకాపల్లి కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలుపుకుని 109 ఓట్లకుగాను, కూటమి బలం 73కు చేరింది. సీపీఐకి చెందిన ఓ కార్పొరేటర్ , వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ముత్తంశెట్టి కుమార్తె కూడా కూటమికే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఆమె కార్పొరేటర్ గా ఉన్నారు. ఇప్పుడు వైసీపీకి పాతిక మంది కార్పొరేటర్లు కూడా లేరు. అయినా మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుంటామని కొత్త ఇంచార్జ్ కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమాగా ఉన్నారు.
ఉత్తరాంధ్ర వైసీపీ సీనియర్లు పట్టించుకోవడంలేదు. మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇంచార్జ్ గా లేకపోయినా ఉత్తరాంధ్ర సీనియర్ నేతగా ఉన్నారు. పైగా ఆయన భార్య విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆమె ఇంచార్జ్ కూడా. ఆయన బాధ్యత తీసుకుని మేయర్ పీఠం చేజారకుండా చేయాల్సి ఉంది. కానీ ఆయన పట్టించుకోవడం మానేశారు.