విశాఖ మేయర్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధమయింది. శనివారం విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే వైసీపీ మెజార్టీ కోల్పోయింది. పాతిక మంది కార్పొరేటర్లు కూడా ఆ పార్టీకి మద్దతుగా లేరు. మేయర్ పదవిని నిలబెట్టుకునే బాధ్యతను గుడివాడ అమర్నాథ్ తో పాటు ఉత్తరాంధ్ర ఇంచార్జ్ గా ఉన్న కన్నబాబుకు ఇచ్చారు. వారు ఒక్క కార్పొరేటర్ మనసు కూడా మార్చలేకపోగా రోజుకొకరు చొప్పున కూటమికి మద్దతు పలుకుతున్నారు.
అయితే విప్ పేరుతో కార్పొరేటర్లను భయపెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. విప్ జారీ చేశామని వైసీపీకి కాకుండా వేరే వారికి ఓటేస్తే అనర్హతా వేటు పడుతుందని బెదిరించడం ప్రారంభించారు. అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో విప్ చెల్లుతుందని ఎక్కడా లేదు. అసెంబ్లీ, పార్లమెంట్ లో అయితే చెల్లుతుంది. విప్ ఉల్లంఘించారని నిర్దారించే చాన్స్ కూడా ఉండదు. మేయర్ కు కార్పొరేటర్లపై అనర్హతా వేటు వేసే అధికారం ఉండదు. ఎస్ఈసీకి ఉంటుంది కానీ.. విప్ ఉల్లంఘన విషయంలో కాదు.
అసలు వైసీపీ జారీ చేసే విప్ ఎందుకూ పనికి రాలేదు. పార్లమెంట్ లో వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా రెండు రోజుల ముందు జారీ చేయాల్సిన విప్ ను ఓటింగ్ అయిపోయాక జారీ చేశారు. కానీ విశాఖలో అవసరం లేని చోట మాత్రం రెండు రోజుల ముందే విప్ జారీ చేశారు. ఎలా చూసినా.. వైసీపీ కోసం క్యాంపునకు కూడా వెళ్లిన కార్పొరేటర్లు చాలా మంది మేయర్ కు వ్యతిరేకంగా ఓటేస్తారని అంటున్నారు. ఓటింగ్ లో కనీస బలం లేకుండా వైసీపీ పరువు పోగొట్టుకుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.