ఉత్తరాంధ్ర వాసుల విశాఖ రైల్వే జోన్ కల నెరవేరబోతోంది. విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొత్తంగా ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో ముందుకెళ్తున్నాయని భూ కేటాయింపు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారమున్నట్లు ఆయన తెలిపారు. తొందర్లోనే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు.
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2018లో ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర కేబినెట్ లోనూ నిర్ణయం తీసుకున్నారు. కానీ తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం రావడంతో పట్టించుకునే వారు కరవయ్యారు. రైల్వేజోన్ ఏర్పాటుకు భూమి అప్పగించాలని రైల్వేశాఖ ఎన్ని సార్లు ప్రతిపాదనలు చేసినా పట్టించుకోలేదు. రైల్వే స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దానికి ప్రత్యామ్నాయంగా స్థలం ఇవ్వాలంటే కేసులున్న భూమిని చూపించింది. ఈ వ్యవహారంతో భూమి రైల్వే పరం కాలదు. ఫలితంగా రైల్వే జోన్ కూడా ఆగిపోయింది.
ఇప్పుడు ప్రభుత్వం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే జోన్ అంశాన్ని సీరియస్ గా తీసుకుని ఫాలో అప్ చేస్తున్నారు . ఇప్పుడు కేంద్రానికి రైల్వేజోన్ ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. రైల్వేజోన్ కు అవసరమైన భూమిని ఇప్పటికే క్లియర్ చేశారు. ఒకటి, రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసుకుని రైల్వే జోన్ అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.