తెలంగాణ విడిపోయాక ఆంధ్రాకి కేంద్రం ఇస్తానన్న రెండు పెద్ద హామీలు… ప్రత్యేక హోదా, రైల్వేజోన్! హోదా అంశం ఎప్పుడో అటకెక్కించేశారు. హోదాకు మించిన ప్యాకేజీ ఇచ్చేశామని కేంద్రం చేతులు దులుపుకుంటే, హోదా సాధించేశామని రాష్ట్ర ప్రభుత్వం కూడా నీళ్లు వదిలేసింది! ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి అదనంగా ఒనగూరిన ప్రయోజనాలు ఎంటయ్యా అంటే.. ప్రభుత్వమే చెప్పలేని పరిస్థితి. వెతుక్కుంటే అంకెల్లో లెక్కలు దొరకొచ్చేమోగానీ… చూసుకునేందుకు కార్యరూపం దాల్చిన ప్రయోజనాలేంటో వారికే తెలీదు! ఎలాగైతేనేం, హోదాని దిగ్విజయంగా మరిపించేశారు. ఇక, మిణుకు మిణుకుమంటూ మిగిలింది రైల్వే జోన్. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని ఊరిస్తూ వస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రిని కూడా ఆంధ్రా కోటా నుంచే రాజ్యసభకు పంపించారు. వార్షిక బడ్జెట్లు వచ్చి వెళ్లిపోతున్నా… రైల్వే జోన్ పై ఇంతవరకూ కేంద్రం స్పష్టత ఇచ్చిందీ లేదు! కనీసం, ఈ విషయంలోనైనా చంద్రబాబు సర్కారు పట్టుదలతో ఉంటుదన్న ‘భ్రమ’ ప్రజలకీ లేదు! హోదా బదులుగా ప్యాకేజీ అనే ప్రత్యామ్నాయాన్ని ఎలా చూపించారో… ఇప్పుడు రైల్వే జోన్ కి కూడా అలాంటిదే చూపే ప్రయత్నంలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది!
వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి కావడంతో ఆయన భాజపాకి దూరమయ్యారు. కేంద్రమంత్రిగా ఉండగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో భాజపాకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తుండేవారు. దాంతో ఏపీకి ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు ఒక కేంద్రమంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో భాజపా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలని అమిత్ షా మేధోమథనం చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో తెరమీదికి వచ్చిన ప్రతిపాదన ఏంటంటే… ఎంపీ కంభంపాటి హరిబాబుకు మంత్రి పదవి ఇవ్వాలనేది! గడచిన ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ భార్య విజయమ్మను ఆయన ఓడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో భాజపా బాధ్యతలు చూస్తున్నారు. ఆయనకి కేంద్రమంత్రి పదవి ఇస్తే.. వెంకయ్య స్థానాన్ని భర్తీ చేయొచ్చ్చని భావిస్తున్నారు. ఆయనకే మంత్రి పదవి ఎందుకనేదానికి కేంద్రం దగ్గర మరో వాదన ఉందని సమాచారం. విశాఖకు రైల్వే జోన్ ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి, అదే ప్రాంతానికి చెందిన ఎంపీకి కేంద్రమంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆ అసంతృప్తిని కొంతమేర తగ్గించవచ్చనేది అమిత్ షా ఆలోచన అని చెబుతున్నారు.
వెంకయ్య నాయుడు స్థానాన్ని భర్తీ చేయడం కోసం హరిబాబు మంత్రి పదవి ఇవ్వడం సరైంది కావొచ్చు. కానీ, రైల్వే జోన్ ఇవ్వలేదు కాబట్టి, విశాఖ ప్రాంతానికి చెందిన ఎంపీకి కేంద్ర క్యాబినెట్ లో చోటు కల్పిస్తే సరిపోతుందని ఎలా ఆలోచిస్తారు..? రైల్వే జోన్ కి కేంద్రమంత్రి పదవి ప్రత్యామ్నాయ ఏర్పాటు ఎలా అవుతుంది..? హరిబాబుకు మంత్రి పదవి ఇస్తే సంతృప్తి పడేది ఆయనా, ఆయనతోపాటు కొంతమంది భాజపా నేతలే! హరిబాబును మంత్రి పదవికి ఎంపిక చేయడం వెనక ఇలాంటి ప్రాతిపదిక కూడా ఉండటం ఆశ్చర్యకరమే. ఏదైతేనేం, తలాతోకా లేని ఈ ప్రత్యామ్నాయ ఏర్పాటు పేరుతో రైల్వే జోన్ అంశాన్ని నిమజ్జనం చేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందనే అర్థం చేసుకోవాలి! రాష్ట్రానికి మరో కేంద్రమంత్రి పదవి ఇస్తే… ఇక రాష్ట్ర భాజపా నేతలు కూడా రైల్వే జోన్ గురించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురారు! ఇక, టీడీపీ ప్రయత్నమంటారా… ముంజేతి కంకణానికి అద్దం అవసరమా..? ఇదే భాజపా కోరుకుంటున్న ప్రయత్యామ్నాయ ఏర్పాటు..!