ప్రభుత్వాలు రాష్ట్ర ప్రయోజనాల మీద దృష్టి పెట్టకపోతే.. చేతికి అందింది కూడా నేలపాలవుతుందనే విషయానికి ప్రత్యక్ష సాక్ష్యంగా విశాఖ రైల్వే జోన్ నిలుస్తోంది. రెండేళ్ల కిందట తెలుగుదేశం పార్టీప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. తీవ్ర స్థాయిలో ఆ పార్టీ ఎంపీలు చేసిన పోరాటం.. విపక్షాలు చేసిన ఆందోళనలతో పాటు.. ఎన్నికలకు ఏదో ఓ తాయిలం ఇచ్చే అలవాటు ఉన్న బీజేపీ .. విశాఖకు దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రకటించింది. ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నా.. ఏదీ లేకపోవడం కన్నా.. ఏదో ఒకటి ఉండటం బెటర్ కదా అన్నట్లుగా చాలా మంది సంతృప్తి పడ్డారు. వైసీపీ నేతలు.. తమకు పార్లమెంట్ సీట్లు ఇస్తే… ప్రజలు కోరుకుంటున్న జోన్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
అది జరిగిపోయి ఇప్పటికి రెండేళ్లవుతోంది. వైసీపీకి ప్రజలందరూ పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. కానీ.. ప్రకటించిన రైల్వేజోన్ కూడా ఇంత వరకూ కార్యాచరణలోకి రాలేదు. సాధారణంగా రైల్వే జోన్లను బడ్జెట్లో ప్రకటించారు. తగినన్ని నిధులూ కేటాయిస్తాయి. గత ఏడాది అసలు ప్రస్తావనే చేయలేదు. ఈ ఏడాది కూడా అలాంటి ప్రస్తావన చేయలేదు. అంటే రైల్వేజోన్ ఏర్పాటు చేయరన్నమాట. నిజానికి రైల్వేజోన్ ప్రకటించిన తర్వాత .. కేంద్రం ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రైల్వేజోన్ ఏర్పాటుకు కొన్ని మౌలిక సదుపాయాలకోసం.. రూ. మూడు కోట్ల నిధులు కేటాయించారు. తర్వాత వాటి మర్చిపోయారు. ఇప్పుడు పూర్తిగా సైలెంటయ్యారు.
ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో కేంద్రం కూడా లైట్ తీసుకుంది. సాదారణంగా రాష్ట్రాల ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తేనే ఎక్కువగా ప్రాజెక్టులకు చోటు కల్పిస్తారు. ఈ సారి అలాంటి పరిస్థితి లేదు. దీంతో రైల్వే శాఖ ఏపీ విషయంలో తమ మౌలిక సదుపాయాలు పెంచుకోవాలనుకున్న వాటికే ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రజలకు… అభివృద్ధికి సంబంధించిన వాటికి మాత్రం బడ్జెట్తో చోటు దక్కలేదు. ఏపీ సర్కార్ కూడా ప్రత్యేకమైన వ్యూహంతో ఉందని.. వచ్చే ఎన్నికల నాటికి కోస్తాకు అన్యాయం చేశారన్న భావన రాకుండా… విశాఖను క్యాపిటల్ చేసి.. జోన్ ను విజయవాడకు ఇచ్చామని చెప్పుకోవడానికి వ్యూహం ఖరారు చేసుకుందని అంటున్నారు. అదే నిజమైతే.. విశాఖ రైల్వే జోన్ చాప్టర్ క్లోజ్ అయినట్లేనని అంచనా వేస్తున్నారు.