విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం ఏపీ ప్రజల్ని దారుణంగా మోసం చేస్తోంది. జోన్ చేస్తామని గత ఎన్నికలకు ముందు ప్రకటించింది. ఒక్క అడుగు ముందుకు వేయలేదు. జోన్ పేరుతో ఇతర పనులు చక్కబెట్టారు.. కానీ జోన్ మాత్రం ముందుకు కదలడం లేదు. ఇది చాలా సుదీర్ఘ ప్రక్రియ అని ఇప్పుడు కథలు చెబుతున్నారు. టైం ఫ్రేం లేదంటున్నారు. గతంలో రైల్వే జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న తరవాత వేగంగా పూర్తయ్యాయి. కానీ ఇక్కడ ఏళ్లు గడుస్తున్నా… చేస్తాం.. చూస్తాం అనే అంటున్నారు.. ఒక్కోసారి ఎలాంటి రైల్వే జోన్ లేదనీ చెబుతూంటారు
రైల్వే జోన్ ఇచ్చేశామని బీజేపీ నేతలు చేసే హడావుడికి లెక్కే లేదు. గత ఫిబ్రవరిలో దేశంలో ఇక కొత్త రైల్వే జోన్లను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని పార్లమెంట్‌లోనే కేంద్రం తేల్చిచెప్పింది. అప్పుడు బీజేపీ నేతలు తెర ముందుకు వచ్చేసి.. ఆల్రెడీ విశాఖ రైల్వే జోన్ ప్రకటించినందున… అది లెక్కలోకి రాదన్నారు. ప్రజల్ని అలాగే మభ్య పెట్టారు. విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటించంారన్న కారణంగా అత్యంత లాభదాయకమైన వాల్తేర్ డివిజన్‌ను ఒడిషాలో కలిపేసింది. విశాఖ రైల్వే జోన్ పనులు అసలు ప్రాథమికంగా కూడా ప్రారంభం కాలేదు కానీ వాల్తేర్‌ను లాగేసుకుని రాయగడలో కలుపుకునే పనులు మాత్రం పూర్తయ్యాయి.
విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు విశాఖలో ఉన్నాయి. డీపీఆర్‌లో ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రైల్వేజోన్‌ను ఏర్పాటుచేసేందుకు విశాఖలో భవనాలు సిద్ధంగా ఉన్నాయి. తీసుకోవాల్సింది అధికారిక నిర్ణయమేనని చెబుతున్నారు. కానీ కేంద్రం మాత్రం ఏపీకి ఏమీ చేయకపోయినా పర్వాలేదనుకుటోంది.. ఎందుకంటే అడిగేవారు లేరు మరి !