విశాఖలో సొంత ఇల్లు ఉండటం అనేది చాలా మందికి ఓ డ్రీమ్. విశాఖ అంటే బీచ్ సిటీ.. అద్భుతమైన నగరం. అక్కడ ఓ ఇల్లు ఉండాలని అక్కడ నివసించని వారు కూడా అనుకుంటారు. అలాంటి సిటీలో ఏ ప్రాంతంలో ఇళ్ల ధరలు తక్కువగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వైజాగ్ రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేకంగా బూస్టప్లు అక్కర్లేదు.ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఎం.వి.పి కాలనీ, సీతమ్మధార,కీర్లంపూడి లే అవుట్ , వుడా కాలనీ, దస్పల్లా హిల్స్ , విశాలాక్షి నగర్ లు బాగా అభివృద్ధి చెందాయి. అక్కడ మధ్యతరగతి ప్రజల స్థాయి కన్నా ధరలు పెరిగిపోయాయి. ద్దిలపాలెం, అక్కయ్యపాలెం, వన్ టౌన్ ఏరియా, కంచరపాలెం, మర్రిపాలెం లాంటి ఏరియాల్లో మధ్యతరగతికి అందుబాటులో ఇళ్లు ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో అపార్టుమెంట్ల నిర్మాణం జోరుగా సాగుతోంది.
ఇక గాజువాక ప్రాంతంపై కూడా ఓ లుక్కేయవచ్చు. బ్యాంకు లోన్స్, విఎంఆర్డిఎ అప్రూవల్, రిజిస్ట్రేషన్ సౌకర్యాలతో గాజువాక ప్రాంతంలో అపార్ట్ మెంట్లు అందుబాటు ధరల్లోనే ఉంటున్నాయి. కూర్మన్నపాలెం, షీలానగర్, పెదగంట్యాడ, చినగంట్యాడ, అగనంపూడి, అక్కిరెడ్డిపాలెం, దువ్వాడ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. గాజువాక ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ధరలు రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్యలో ఉన్నాయి. అన్ని సౌకర్యాలతో ఈ ధరలో వస్తూండటంతో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.
రానున్న రోజుల్లో విశాఖకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఈ క్రమంలో డిమాండ్ విపరీతంగా పెరగనుంది. ఎయిర్ పోర్టు వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఆలోపు చాలా పెద్ద ఎత్తున విశాఖ నగరం విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది.