విశాఖ వాసులకు వారాంతం వస్తే ఎక్కడ ఏ కూల్చివేతలు జరుగుతున్నాయోనన్న టెన్షన్ ఉంటుంది. ఇప్పటి వరకూ ప్రైవేటు ఆస్తులను కూల్చివేశారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ ఆస్తులనే కూల్చేస్తున్నారు. విశాఖలో సముద్రాన్ని ఆస్వాదించాలనుకునేవారికి రుషికొండ బీచ్ రిసార్ట్ అద్భుతంగా ఉంటుంది. టూరిజంకు అదో మణిహారం. భారీ ఆదాయాన్ని తెచ్చి పెట్టే వనరు. ఈ బీచ్ రిసార్ట్‌ను మొత్తంగా కూల్చేస్తున్నారు. కూల్చివేత పనులు వేగంగా జరిగిపోతున్నాయి. రెండు కాటేజీలను పూర్తిగా నేలమట్టం చేశారు.
విశాఖ బీచ్ రోడ్లో గీతం కాలేజీ వైపు వెళ్తే కొండలపై ఉన్న బీచ్ రిసార్టులు చూడటానికే అద్భుతంగా ఉంటాయి. అక్కడ విడిది చేయాలని.. తెల్లవారుజామునే సముద్రాన్ని ఆస్వాదించాలనుకునే పర్యాటకుల సంఖ్య తక్కువేమీకాదు. పైగా అక్కడ అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వాటిని నిర్మించి 14ఏళ్లు మాత్రమే అయింది. అంతే కాదు ప్రతీ ఏడాది వాటికి సౌకర్యాల కోసం రూ. కోట్లు ఖర్చు చేస్తున్నారు. గత ఏడాదే రూ.రెండు కోట్లు పెట్టి 22గదుల్లో అదనపు సౌకర్యాలు కల్పించారు. అలాగే రెస్టారెంట్, కాన్ఫరెన్స్ హాలును రూ. కోటి పెట్టి సౌకర్యాలు మెరగు పరిచారు. కాంట్రాక్టర్లకు ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉంది.
ప్రస్తుతం కూల్చేస్తున్న బీచ్ రిసార్ట్ టూరిజం శాఖకు.. ఏటా రూ. 30 కోట్ల ఆదాయం తెచ్చి పెడుతుంది. ఎందుకు కూల్చివేస్తున్నారని అంటే.. అక్కడ మళ్లీ కొత్త రిసార్టులు కడతామని ప్రభుత్వం చెబుతోంది. కొత్త ప్రాజెక్టులో మొదటిదశ పనులు రూ.91 కోట్లతో చేపడుతున్నామని…15 నెలల్లోగా పూర్తవుతాయని అంటున్నారు. కానీ ప్రభుత్వం రోడ్లపై గుంతలనే పూడ్చలేని పరిస్థితుల్లో ఉంది. కూల్చేసిన తర్వాత కట్టలేకపోతే.. దానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నప్రశ్న విశాఖ వాసుల నుంచి వస్తుంది. కానీ ఎవరూ సమాధానం చెప్పరు. ముందుగా కూల్చివేయడమే .. కడతారా లేదా అన్నది తర్వాత సంగతి..!