విశాఖ స్టీల్ ప్లాంట్‌కు భారీ లాభాలు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల్లోనే పన్నుల అనంతరం రూ.1008 కోట్ల లాభాలాను సొంతం చేసుకుంది. ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తే స్టీల్ ప్లాంట్‌కు ఇప్పటి వరకూ నష్టాలన్నీ రెండు, మూడేళ్లలోనే కరిగిపోతాయి. కానీ ఇప్పటికే చేయిదాటిపోయింది. స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మడానికి కేంద్రం సన్నాహాలు పూర్తి చేసింది. న్యాయసలహాదారుల్ని కూడా నియమించింది. స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారంటే.. నష్టాలనే కేంద్రం కారణంగా చూపుతోంది. కానీ ఆ నష్టాలు తాత్కాలికమేనని ఆ సంస్థ పనితీరు నిరూపిస్తూనే ఉంది.
అమ్మకపోతే మూసివేస్తామని కేంద్రం చెబుతోంది కానీ ప్రజల సెంటిమెంట్లతో ముడిపడిన పరిశ్రమల్ని కాపాడాలనే ఆలోచన చేయడం లేదు. అప్పుల్లో నిండా మునిగిపోయి ఎటూ తేలకుండా ఉండిపోయిన ఎయిర్ ఇండియాను టాటా సంస్థలకు అమ్మేస్తే ఎవరూ పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ స్టీల్ ప్లాంట్ అలాంటిది కాదు. టాటా సంస్థ కొన్నా ప్రజలు తమ ఆస్తి పరాయి వాళ్లు తీసుకున్నట్లుగా ఫీలవుతారు. ప్రస్తుతం ఉద్యోగులు మాత్రమే ఉద్యమం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు. దీంతో స్టీల్ ప్లాంట్ సమస్య ఎవరికీ కాకుండా అయిపోతోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాస్త ఆలస్యంగానైనా స్పందించారు. వారు ఆదివారం నిర్వహిస్తున్న బహిరంగసభకు హాజరవుతున్నారు. పోలీసులు మొదట పర్మిషన్ నిరాకరించి.. ఉద్యోగులు ధర్నా చేయడంతో చివరికి అనుమతి ఇచ్చారు. పవన్ సభ తర్వాత అయినా ఇతర పార్టీలు, ప్రజల్లో కదలిక వస్తే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునే ఉద్యమం మరోసారి ఎగసిపడే అవకాశం ఉంది.