విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి సాధించుకున్న ప్లాంట్ ఇప్పుడు.. ప్రైవేటు హక్కుగా మారబోతోంది. కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ పథకాల్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్లోనూ వాటాలు అమ్మేయబోతున్నారు. అయితే ఇక్కడ కొంత శాతం అమ్మేసి.. ప్రభుత్వ అధీనంలోనే ఉంచాలని అనుకోవడం లేదు. మొత్తంగా వంద శాతం వాటాలను ప్రైవేటుకు అమ్మేసి.. చేతులెత్తేయబోతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు కూడా తుది దశకు చేరింది. కేంద్ర మంత్రి వర్గం కూడా ఆమోదం తెలిపింది.
విశాఖ ఉక్కు కర్మాగారం రాష్ట్రీయ ఇస్ఫాత్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఉంటుంది. ఇది వంద శాతం ప్రభుత్వ కంపెనీ. ఆర్ఐఎన్ఎల్కు రెండు సబ్సిడరీ కంపెనీలు ఉన్నాయి. ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్, బిస్రా స్టోన్ లైన్ కంపెనీ అనే రెండు కంపెనీలు ఉన్నాయి. అయితే.. గతంలో భారీ లాభాలను ఆర్జించినసంస్థ… ఇటీవల నష్టాల బాట పట్టింది. 2017-18లో 16,618 కోట్ల అమ్మకాలు జరగ్గా రూ.1,368 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. అయితే అప్పట్లో స్టీల్ ఇండస్ట్రీకి మాంద్యం వచ్చి అమ్మకాలు తగ్గాయి. 2018-19లో రూ.20,844 కోట్ల అమ్మకాలు జరగడంతో నష్టాలను రూ.97 కోట్లకు తగ్గించగలిగింది. తర్వాత ఏపీలో ప్రభుత్వం మారడం.. నిర్మాణ రంగం కుదేలవడం.. దేశవ్యాప్తంగా డిమాండ్ తగ్గడంతో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో నష్టాలు మూడు వేల కోట్లకు పెరిగాయి.
విశాఖ ఉక్కులో 17 వేల మంది పర్మనెంట్ ఉద్యోగులతో పాటు మరో 15 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యం 63 లక్షల టన్నులు. ఒక్క విశాఖ ఉక్కుకే కాదు… ప్రస్తుతం అన్ని ఉక్కు కర్మాగారాలదీ ఇదే పరిస్థితి. ఉత్పత్తి వ్యయం పెరగడం, డిమాండ్ లేకపోవడంతో ఆశించిన అమ్మకాలు జరగడం లేదు. అయినా సరే ఇదే మంచి తరుణం అనుకుంటున్న కేంద్రం విశాఖ ఉక్కును తెగనమ్మడానికి నిర్ణయించేసింది. విశాఖ ఉక్కును పోస్కోకు కట్టబెట్టడానికి కేంద్రం ఎప్పట్నుంచో సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విస్తరణ ప్రాజెక్టు ఆ కంపెనీకే ఇచ్చారు. అతి త్వరలోనే… వంద శాతం వాటాలను కేంద్రం అమ్మేయడం ఖాయంగా కనిపిస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంటుంది. విశాఖ స్టీల్ అంటే ఓ బ్రాండ్. అలాంటి పరిశ్రమ నష్టాల్లోకి రావడానికి గల కారణాలను ఆన్వేషించి… లాభాల్లోకి తేవాలి కానీ.,. ప్రైవేటుకు అమ్మేస్తేనే ప్రయోజనం ఉంటుందని అనుకోవడంతోనే సమస్య వస్తోంది. ఎవరూ నోరు మెదిపే పరిస్థితి లేకపోవడంతో విశాఖ ఉక్కును కాపాడుకునే పరిస్థితి ఆంధ్రులకు లేకుండా పోతోంది.