ఏదైనా కొనాలి అనుకుంటే మనం ఈఎంఐ ఆఫర్ల కోసం ఎదురు చూస్తూంటాం కానీ అదానీ అలా కాదు. తనకు అది కొనాలి అనిపిస్తే ఎదైనా సరే కొనండి.. కొనండి అని ఎదురొస్తుంది. అప్పుగా అయినా సరే కొనేసుకోండి అనే పెద్దలూ అండగా ఉంటారు. ఇప్పటి వరకూ జరిగింది.. జరుగుతోంది అదే. ఏపీలో పోర్టులు, హైవేలు, సంప్రదాయేతర ఇంధన విద్యుత్ లలో ఇప్పుడు అదానీ కి మెజార్టీ షేర్ ఉంది. త్వరలో విశాఖ ఉక్కు కూడా అదానీ గుప్పిట్లోకి చేరబోతోంది. ఎందుకంటే దాన్ని కొనాలని అనుకుంటున్నట్లుగా ఇప్పుడే బయటకు వచ్చింది.
విశాఖ ఉక్కు ను అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ ప్రక్రియ సాగుతోంది. ఎవరు కొంటారా అని చాలా మంది చూస్తున్నారు. చాలా కంపెనీల పేర్లు వినిపించాయి. ఈ లోపు ఉద్యోగులు… రాజకీయ పార్టీలు వ్యతిరేకత చూపించాయి. అయితే మూసివేయడానికైనా సిద్ధమే కానీ అమ్మడం మాత్రం పక్కా అని కేంద్రం తేల్చేసింది. అయితే ఇప్పుడు విశాఖ ఉక్కుపై అదానీ ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఆయన తన వ్యాపార విస్తరణ కోసం ఎప్పుడూ కొత్త సంస్థలు ప్రారంభించరు. ఉన్న వాటినే కొనేస్తారు. ఇలా కొనుగోళ్లు చేయడం ద్వారానే ఆయన కుబేరుడయ్యాడు. అదే సమయంలో అప్పుల అప్పారావు కూడా అయ్యారనుకోండి అది వేరే విషయం.
ఇప్పుడు అదానీ .. విశాఖ ఉక్కును కొనాలనుకుంటే అడ్డేముండదు. ఎందుకంటే ఆయనకు అటు ఢిల్లీ ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. ఎంతో సహకరిస్తాయి. ఎంత కావాలంటే అంత సహకరిస్తాయి. దీనికి ప్రత్యేక సాక్ష్యాలక్కరలేదు. ఇన్ స్టాల్ మెంట్లలో అయినా సరే చెల్లించి ఉక్కు ఫ్యాక్టరీని తీసుకోమని ఆఫర్ కూడా ఇవ్వొచ్చు. ఒక్క సారిగా అదానీ ఆ సంస్థను కొనాలని అనుకున్న తర్వాత వెనక్కి తగ్గిన సందర్భం లేదు. ఇప్పుడూ ఉండకపోవచ్చు. అందుకే త్వరలో విశాఖ ఉక్కు.. అదానీ స్టీల్స్గా మారిపోయే అవకాశాన్ని రాసి పెట్టుకోవచ్చు.