స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని కేంద్రం తేల్చేయడం.. ప్రతీ అంశాన్ని ఏపీ సర్కార్ దృష్టికి తీసుకెళ్లే అమలు చేస్తున్నామని చెప్పడం.. స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని విశాఖ వాసుల్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. నిన్న పార్లమెంట్లో ప్రకటన చేసిన తర్వాత ఒక్క సారిగా తమ ఆందోళనల ఉద్ధృతిని కార్మికులు పెంచారు. ఈ రోజు అది తారస్థాయికి చేరింది. కార్మికులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు కూడా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారి ఒకరిని .. పరుగులు పెట్టించారు. అతనిని అతి కష్టం మీద భద్రతా సిబ్బంది సురక్షితంగా తీసుకెళ్లగలిగారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న గాజువాకలో పరిస్థితి ఉద్రిక్తంగా కనిపిస్తోంది. రాజకీయ పార్టీల నేతలు మద్దతు పలుపుకున్నారు. అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు.. ఆందోళనల్లో పాలు పంచుకుంటున్నారు. తాడోపేడో తేల్చుకోవాల్నట్లుగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. జాతీయ స్థాయికార్మిక సంఘాలు కూడా మద్దతు పలికాయి. పెద్ద ఎత్తున సంఘిభావం తెలిపేందుకు విశాఖ రావాలని నిర్ణయించారు. దీంతో ఉద్యమం మరింత ఊపందుకోనుంది.
ప్రజాప్రతినిధుల రాజీనామాల కోసం డిమాండ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో తన రాజీనామాను ఆమోదింప చేసుకుంటానని గంటా శ్రీనివాస్ ప్రకటించారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు లేఖ రాయలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని… ఎంపీలతో రాజీనామా చేయించి.. ఉద్యమానికి నేతృత్వం వహిస్తే… తామంతా జగన్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. వైసీపీ ఎంపీలు..కేంద్రంపై పోరాడకపోతే.. రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ నేతలు.. కేంద్రం ప్రకటన తర్వాత సైలెంటయిపోయారు. ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు.
కేంద్రం రగిలించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కొలిమిలో ప్రస్తుతం విశాఖ రగిలిపోతోంది. స్టీల్ ప్లాంట్ అనేది ఆ సంస్థ లాభనష్టాలకు సంబంధించి నఅంశం కాదని ఆంధ్రుల సెంటిమెంట్ అన్న భావన బలపడుతోంది. ఆందోళనలు ఏ స్థాయికి వెళ్తాయో అంచనా వేయడం కష్టం. రాజకీయంగా ఇతర పార్టీల్ని ఎంతగా భయపెట్టి నోరు మెదకపోయినా ప్రజలు మాత్రం సైలెంట్‌గా ఉండే అవకాశం కనిపించడం లేదు.