గ్రేటర్ విశాఖ మేయర్ కార్పొరేటర్ల విశ్వాసం కోల్పోయారు. వైసీపీ తరపున మేయర్ గా ఉన్న గొలగాని వెంకట హరికుమారిపై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి కార్పొరేటర్లు రెడీ అయ్యారు. వైసీపీకి చెందిన కనీసం ముఫ్పై మంది కార్పొరేటర్లు ఇప్పటికే పార్టీ ఫిరాయించారు. మొత్తం 99 మంది కార్పొరేటర్లు ఉన్న కార్పొరేషన్ లో ఇప్పుడు వైసీపీకి పాతిక మంది కార్పొరేటర్లు కూడా లేరు. అయినా మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుంటామని కొత్త ఇంచార్జ్ కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెబుతున్నారు. విశాఖలో తమ పార్టీలో ఉన్న కార్పొరేటర్లతో వారు సమావేశం అయ్యారు. పాతిక మంది కార్పొరేటర్లు వచ్చినా ఎవరు పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఆ పార్టీలో ఉంది.
మున్సిపల్ చట్టం ప్రకారం మొదటి సారి ఎన్నికైన తర్వాత నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు మేయర్ పదవి కాలం నాలుగేళ్లు పూర్తయింది. రేపోమాపో అవిశ్వాసం పెట్టాలన్న యోచనలో కూటమి నేతలు ఉన్నారు. ఇప్పటికే పార్టీలో చేరిన వారు.. కూటమి కార్పొరేటర్లు కలిసి మేయర్ ను దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుత మేయర్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. మేయర్ అభ్యర్థిగా కూటమి తరపున ఎవరిని ఖరారు చేయాలన్నదానిపై చర్చలు జరుపుతున్నారు.
విశాఖ మేయర్ పీఠం వైసీపీ నుంచి జారిపోవడం ఖాయంగా ఉంది. అయితే అమర్నాథ్, కన్నబాబులకు పార్టీ హైకమాండ్ మాత్రం వార్నింగ్ ఇచ్చింది. కార్పొరేటర్లను జారిపోకుండా చూసుకుని కూటమికి షాక్ ఇవ్వాలని ఆదేశించింది. దాంతో వారిద్దరూ తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నారు. కానీ వారి మాటల్ని కార్పొరేటర్లు వినే అవకాశం కనిపించడం లేదు. విశాఖలోని ఇతర వైసీపీ నేతలు అసలు పట్టించుకోవడం లేదు.