శనివారం సాయంత్రం మీరంతా ఆశ్చర్యపోయేలా గెలిచి చూపిస్తామన్న యడ్యూరప్ప….కర్ణాటక అసెంబ్లీలో గంట ముందే చేతులెత్తేశారు. అన్నీ సెట్ చేసేసుకున్నాం..గెలిచేస్తున్నామని చెప్పిన యడ్యూరప్ప..ఒక్కసారిగా ఎలా డీలా పడిపోయారు..? గాలి జనార్ధన్ రెడ్డి లాంటి బేరగాళ్లు.. శ్రీరాములు లాంటి లాబీయిస్టుల ప్రయత్నాలు ఎందుకు ఫలించలేదు..?. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ.. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క యాప్‌తో అడ్డుకుంది. బీజేపీని అడ్డంగా బుక్ చేసి… గేమ్‌లో అడ్వాంటేజ్ సాధించింది.
యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించగానే… కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలందర్నీ క్యాంపులకు తరలించారు. వారందరూ రిసార్టులకు, హోటళ్లకు రాగానే… ముందుగా వారి ఫోన్లు తీసుకున్నారు. కానీ వెంటనే ఇచ్చేశారు. ఆ ఎమ్మెల్యేలు వారి ఫోన్లను యథావిధిగా వాడుకున్నారు. వారు ఫోన్లు చేశారు. వారికి కొందరు చేశారు. కానీ వారు ఎవరికి చేశారు..? వారికి ఎవరు చేశారన్న రికార్డు మాత్రం కాంగ్రెస్‌కు చేరిపోయింది. ఎలా అంటే.. వారి ఫోన్లలో సీక్రెట్‌గా వాయిస్ రికార్డింగ్ యాప్‌ను పెట్టి ఇచ్చారు. అదే కీలక ఘట్టం. వరుసగా బీజేపీ నేతలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయడం .. ఆడియోతో దొరికిపోవడం జరిగిపోయింది.
కాంగ్రెస్ ఈ ఆడియో సాక్ష్యాలను చాలా పకడ్బందీగా విడుదల చేసింది. తొలి రోజు… గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీరాముల బేరసారాలు.. ఆ తర్వాత ప్రకాశ్ జవదేకర్, ఆ తర్వాత యడ్యూరప్ప.. ఆ తర్వాత మురళీధర్ రావు.. ఇలా వరుసగా ఆడియో టేపులు విడుదల చేస్తూ ఉంటే.. బీజేపీ నేతలకు మైండ్ బ్లాకయిపోయింది. ఎలా సమర్థించుకోవాలో కూడా తెలియలేదు. ప్రకాశ్ జవదేకర్ అయితే మిమిక్రి అని తప్పించుకునే ప్రయత్నం చేశారు. అది నిజంగా మిమిక్రి అయితే.. వెంటనే న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు కదా..! కానీ బీజేపీ నేతలెవరూ ఆ టేపుల ఇష్యూని పెద్దది చేయదల్చుకోలేదు.
ఓ వైపు అధికార దుర్వినియోగం ఆరోపణలు.. మరో వైపు వందల కోట్లు పెట్టి.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలు.. వెరసి..బీజేపీ అసలు రాజకీయ పార్టీయేనా అన్న అనుమానం ప్రజల్లోకి వచ్చేలా చేసింది.దాంతో చివరి క్షణంలో పరువు పోకుండా ఉండటానికి బీజేపీ హైకమాండ్ వెనక్కి తగ్గింది. ప్రతీసారి నిర్లక్ష్యంతో నష్టపోయే కాంగ్రెస్ ఈ సారి మాత్రం పకడ్బందీ వ్యూహం.. ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకుని బీజేపీకి చెక్ పెట్టింది.