ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు చెలరేగిపోతున్నారు. అన్ని రకాల నేరాల్లోనూ వారు ప్రముఖంగా తెరపైకి వస్తున్నారు. శ్రీకాకుళం డీఎస్పీ ఆఫీసు ఎదురుగానే నడి రోడ్డుపై ఓ వాలంటీర్ మరో వాలంటీర్ను నడిరొడ్డుపై నరికి హత్య చేశాడు. ఇద్దరూ వాలంటీర్లే. నిజానికి ఆ వాలంటీర్లు ఇద్దరూ పాత నేరస్తులే. తీవ్రమైన నేరాలు వారిపై ఉన్నాయి. ఆ వాలంటీర్లే కాదు.. ఇతర వాలంటీర్లూ అలాంటి వారేనని చాలా కాలంగా జరుగుతున్న ఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి. ఇటీవల తూ.గో జిల్లా కాకినాడలో ఓ వాలంటీర్… పెన్షన్ పెరిగిందని వృద్ధురాలి సంతకం తీసుకున్నాడు. కానీ అది ఆస్తి పత్రం అని.. మోసం చేశాడని ఆ వృద్ధురాలు స్పందనలో గోడు వెళ్లబోసుకుంది.
ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి. శ్రీకాకుళంలోనే ఓ వాలంటీర్ మూడు కోట్లతో ఉడాయించింది. రోజు రోజుకు వారి ఆకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆడవాళ్లపై వారు చేసిన ఆకృత్యాల కేసులకయితే లెక్కేలేదు. గుంటూరు జిల్లాలో ఏకంగా బాలింతపైనే వాలంటీర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నెల్లూరులో ఓ బాలికను చెరపట్టాడు. వాలంటీర్లు చేస్తున్న నేరాలపై ప్రతి రోజూ ఏదో ఓ చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పోలీసులపై తిరగబడటం.. ఉద్యోగుల్ని బెదిరించడం వంటి ఘటనలు లెక్కే లేదు.
వాలంటీర్లు తాము చట్టాలకు అతీతమని అనుకుంటున్నారో… అంతకు మించి ప్రభుత్వమే తాము అని ఫీలవుతున్నారో కానీ.. వారు చేస్తున్న నేరాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. పలు చోట్ల.. అత్యాచారాలు.. అత్యాచారయత్నాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం అక్రమ రవాణా దగ్గర్నుంచి పోలీసులపై దాడులకు పాల్పడటం వరకూ ఘటనలపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారుతున్నారన్న ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నా పట్టించుకుంటున్న వారు లేరు. ప్రభుత్వం వారికి అవార్డులిచ్చి సన్మానాలు చేస్తోంది. రేపు ఉగాదికి కూడా ఈ వాలంటీర్లకు సన్మానాలు చేయబోతున్నారు.