వాలంటీర్లు అంటే దైవాంశ సంభూతులు అని .. ఈ మధ్య బూతులు మాట్లాడే తమ నోటి వెంట .. అసువుగా ప్రకటనలు చేసేస్తున్నారు ఏపీ మంత్రులు. అలాంటి దైవాంశ సంభూతుడు ఒకరు విశాఖలో ఓ వృద్ధురాలిని దారుణంగా చంపేసి ఆమె ఒంటిపై ఉన్న నగలు ఎత్తుకెళ్లిపోయాజు. ఈ ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతోంది.
విశాఖపట్నం 95వ వార్డు సచివాలయం పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తున్న వెంకటేష్ పార్ట్‌టైమ్‌గా చికెన్ షాపులో పనిచేస్తున్నాడు. వాలంటీర్ కదా అని.. ఖాళీగా ఉన్నప్పుడు పని చేసుకోమని చికెన్ షాపులో పెట్టుకుంటే ఆ ఇంట్లో ఉన్న వారి వ్యవహారాలన్నీ గుర్తు పెట్టుకున్నాడు. ఇంట్లో ఉన్న పెద్దావిడ ఒంటిపై చాలా బంగారం ఉందని గుర్తించి.. ఒంటరిగా ఉన్నప్పుడు దోచుకెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాడు. అలా కుదరడంతో ఆదివారం రాత్రి ఇంటికి వెళ్లి ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా హత్య చేసి బంగారం తీసుకెళ్లిపోయాడు.
కుటుంబసభ్యులు వచ్చి చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలుక చెక్ చేసిన పోలీసులు వాలంటీర్ వెంకటేష్ ఇంట్లోకి వెళ్లడం… బయటకు వచ్చిన దృశ్యాలు కనిపించాయి. దాంతో అరెస్ట్ చేశారు. వెంకటేష్ అసలు విషయాన్ని బయట పెట్టాడు. వాలంటీర్లు వరుసగా పలు నేరాలకు పాల్పడుతున్న వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. అయితే వారంతా దైవాంశ సంభూతులని .. మంత్రులు ఏ మాత్రం తోట్రు పడకుండా పొగిడేస్తున్నారు.