ప్రభుత్వానికి నెలాఖరు వరకు గడువిచ్చామని తర్వాత సమ్మె చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. వారి బాధలు వారివి. ఒకటో తేదీన జీతం వస్తుందో లేదో అనే బాధ దగ్గర్నుంచి పీఆర్సీ కాదు కదా.. కనీసం నివేదిక అయినా ఇవ్వలేదంటున్నారు. వారి జీపీఎఫ్ సొమ్ములు కూడా ప్రభుత్వం వాడుసేకుంది. రిటైర్ అయిన వారికి బెనిఫిట్స్ అందడం లేదు. అందుకే ఉగ్గబట్టుకోలేకపోతున్నారు. పోరాటం అని తెర ముందుకు వస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం చాలా ప్లానింగ్‌తోనే ఉంది. వారిని కావాల్సినట్లుగా అవమానిస్తోంది. దీంతో వారు మరింతగా ఆవేశపడుతున్నారు.
ఉద్యోగులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఉద్యోగుల విషయంలో ప్రజలకు అంత సానుకూల అభిప్రాయం ఉండదు. వారికి ప్రజల్లో మద్దతు లభించదు. లక్షలకు లక్షలు ప్రజల పన్నులను జీతాలు తీసుకుంటూ పని చేయరన్న అభిప్రాయం ఉంది. అలాగే లంచాల కోసం పీడిస్తారని ఈడించుకుంటారు. ఇక ఉద్యోగులకు అంతే జరగాలి అని తెలుగుదేశం పార్టీ నేతలు చంకలు గుద్దుకుంటూ ఉంటారు. తాము ఎంత చేసినా తమపై వ్యతిరేకత చూపి.. దొంగ ఓట్లు వేసి మరీ జగన్‌ను గెలిపించారని.. ఇప్పుడు అనుభవించాలన్నది వారి సంతోషం. అటు ప్రజల నుంచి ఇటు ప్రతిపక్షం నుంచి సపోర్ట్ రాకుండా చేయడంలో అధికారపక్షం సక్సెస్ అవుతుంది.
ఇప్పుడు ఉద్యోగులు సమ్మె అన్నారంటే సీఎం జగన్… గతంలో తమిళనాడు సీఎం తీసుకున్న విధంగా నిర్ణయం తీసేసుకుంటారు. అందులో ఎలాంటి సందేహం ఉండదు. అందర్నీ మాసివ్‌గా ఉద్యోగాల నుంచి తొలగించేసి.. కావాలంటే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో పాలన నడిపించేయగలరు. అప్పుడు ఆయన ఇమేజ్ కూడా జయలలిత స్థాయి లో పెరగుతుంది. వైసీపీకి అంత కంటే ఎక్కువ లాభం వస్తుంది. ఉద్యోగుల ఓట్లు అక్కర్లేదా అని నేతలు ప్రశ్నిస్తున్నారు కానీ.. కులం, మతం, ఓటింగ్ రోజు చేతిలో పడే పైసల్ని బట్టే ఉద్యోగులు కూడా ఓట్లేస్తున్నారు. అందుకే వారి ఓట్లు ఎలా తెచ్చుకోవాలో వైసీపీకి బాగా తెలుసు. అందుకే ఉద్యోగం సంఘం నేతలు హెచ్చరికలతోనే సరి పెట్టి.. ముందుకెళ్లకుండా ఉంటే వారికే మంచిదనే సలహాలు అధికార పార్టీ నుంచి జోరుగా వస్తున్నాయి. ఉద్యోగ నేతలు ప్రబుత్వ పెద్దలకు సన్నిహితులే. అందుకే.. వారు కూడా మరీ ముందుకెళ్లబోరని చెప్పుకుంటున్నారు.